ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ లు మళ్లీ అధికారం చేపట్టటం ఖాయమైపోయింది. 2001 అక్టోబర్ లో అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేయటంతో అధికారం కోల్పోయిన తాలిబాన్లు 20ఏళ్ళ తదనంతరం తిరిగి పగ్గాలు చేపట్టారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న అష్రాఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయారు. అమెరికా చెబుతున్న దాని కంటే ముందే తాలిబాన్లు కాబూల్ ని ముట్టడించారు. తాలిబాన్ల భయంతో వందల సంఖ్యలో కాబూల్ వదిలి పారిపోవటానికి ప్రజలు పరుగులు తీస్తున్న దృశ్యం కనబడుతున్నాయి. ఇటువంటి పరిస్థితికి ఏర్పడటానికి కారణం ఏమిటి? సుమారు మూడు కోట్ల జనాభా గల ఆఫ్ఘనిస్తాన్ లో పరిణామాలు ఎందుకిలా వచ్చాయో మనం పరిశీలన చేయాలి.
ప్రపంచంలో సామ్రాజ్యవాద దోపిడీని అడ్డుకునే దేశాలను కమ్యూనిజం పేరుతో కూల్చివేయటం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. రెండవ ప్రపంచ యుద్ధానంతరం సుమారు 70 ఘటనల్లో అమెరికా జోక్యం చేసుకుని మారణహోమం సృష్టించింది. వియత్నాం, చిలీ, ఇరాక్, క్యూబా, లిబియా, లెబనాన్ ఇంకా అనేక చోట్ల లక్షలమంది ప్రాణాలను హరించింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయిన ప్రభుత్వాలను సైతం కూల్చివేసింది. 1978లో ఆఫ్ఘన్లో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఇదే సామ్రాజ్యవాద అమెరికాకు కంటగింపుగా మారింది. నజీబుల్లా నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేయటంకోసం సర్వశక్తులు ఒడ్డింది.
ప్రచ్చన్న యుద్ధ సమయంలో మధ్య ఆసియాలో ఉన్న అపారమైన ఆయుధం ఆయిల్ నిల్వల కోసం, దానిపై ఆధిపత్యం కోసం సోవియట్ బూచి చూపిస్తూ అమెరికా సాగించిన అకృత్యాలలో భాగంగా మొజాహిదీన్ లు పుట్టుకొచ్చారు.
#పాకిస్తాన్ కు అమెరికా తొలి నుంచి మద్దతుగా నిలిచింది. ఇటు ఇండియా, అటు సోవియట్ యూనియన్ ను అదుపులో పెట్టే చర్యల్లో భాగంగా పాకిస్థాన్ కు భారీ సైనిక సాయాన్ని అమెరికా అందిస్తూ వచ్చింది. పాకిస్థాన్ ప్రభుత్వ అండతో ఆఫ్ఘనిస్తాన్ లోని కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా పథకం ప్రకారం వ్యతిరేకులను సమీకరించి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలకు తరలించి అక్కడే వారికి ఆయుధ శిక్షణ ఇచ్చింది. ఇందుకు లక్షల కోట్ల డాలర్లను అమెరికా ఖర్చు చేసింది. పర్మినెంట్ శిక్షణాలయాలకు ఆర్థిక సహకారం అందిచటంతోపాటు భారీగా ఆయుధాలు సరఫరా చేసింది. అమెరికా, పాకిస్థాన్ గూఢచారి సంస్థలు ఇందుకు పూర్తిగా సహకరించాయి. ఈ శిక్షణా సంస్థలలోనే తాలిబాన్ల సృష్టి జరిగింది.
ఈ శిబిరాల్లో శిక్షణ పొందిన మోజాహిదీన్ లు తొలుత ఆఫ్ఘన్ ప్రభుత్వం పైన, ఆ తరువాత దానికి రక్షణగా వచ్చిన సోవియట్ రష్యా సేవలపై పోరాడాయి. 1990లో మారిన ఈ పరిస్థితులలో సోవియట్ సేనల ఉపసంహరణతో అమెరికా అనుకూల ముజాహిద్దీన్ ల పని సులువైంది. కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చేసి అధ్యక్షుడు నజీబుల్లా ఉరి తీసి అమెరికా అండతో అధికారాన్ని మొజాహిదీన్ లు స్వాధీనం చేసుకున్నారు. భస్మాసురుడి హస్తం లాగా వారే ఇప్పుడు ప్రపంచానికి ప్రాణసంకటంగా మారారు. అమెరికా సృష్టించిన ఈ ఉగ్రవాద మూకలే ఆఫ్ఘన్ ప్రజలను వణికిస్తున్నాయి.
ముజాహిదీన్ పాలన 1990 నుంచి సాగింది. ఈ పాలనపై ముఖ్యంగా అవినీతి పై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి రావటంతో 1994 నుంచి ముజాహిదీన్ లో నుండి తాలిబాన్లు చీలి కొంత ప్రాంతంలో ఆధిపత్యం సంపాదించారు. వీరి మధ్య ఆధిపత్య పోరు జరిగింది. అవినీతిపై పోరాడతామని చెప్పటంతో ప్రారంభంలో తాలిబాన్ల పట్ల ప్రజల్లో కొంత సానుకూలత ఉండేది. మొజాహిదీన్ లు నుండి 1998 లో తాలిబాన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత తాలిబాన్ల ఆటవిక పాలన మొదలయ్యింది. అక్రమ సంబంధానికి తలలు నరకటం, దొంగతనాలకు కాళ్లు చేతులు బహిరంగంగా తీయటం, పురుషులు గడ్డాలు పెంచాలని స్త్రీలు బురఖా ధరించాలని ఆదేశించటం, టీవీ, సినిమా, సంగీతాలను నిషేధించడం చేశారు. చివరకు 2001లో ప్రపంచ ప్రఖ్యాత బుద్ధ విగ్రహాలను సైతం ధ్వంసం చేశారు.
2001_సెప్టెంబర్_11న అమెరికాపై దాడి జరిగింది. ఆ సాకుతో తను సృష్టించిన తాలిబన్లపై 2001 అక్టోబర్ లో ఆఫ్ఘన్ పై అమెరికా దాడి మారణహోమం సృష్టించింది. గత 20 ఏళ్లుగా తన కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి నడిపింది. తాలిబాన్లను నిర్మూలించలేక పోయింది. 20 ఏళ్ళ అనుభవం తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో 2020 ఫిబ్రవరిలో తాలిబాన్లతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుని తన సైన్యాన్ని వెనుకకు తీసుకున్న నేపథ్యంలో ఈ పరిణామాలు జరుగుతున్నాయి.
సామ్రాజ్యవాదం, కార్పొరేట్ కంపెనీలు తమ దోపిడీని కొనసాగించటం కోసం ఎన్ని మారణహోమాలైనా సృష్టిస్తాయని దానికి ఇటువంటి ఘటనలే నిదర్శనం. మనదేశంలోనూ గుత్త పెట్టుబడి దారులు తమ దోపిడీ పాలన కొనసాగించటం కోసం మతతత్వ శక్తులకు అధికారం కట్టబెడితే పరిణామాలు ఎంత ఆందోళనకరంగా ఉంటాయో మనం చూస్తున్నాం. ఆఫ్ఘన్ పరిణామాలూ అటువంటి పాఠాన్నే మనకు నేర్పుతుంది.