కాకినాడలో ఊహించిన ఫలితమే.!

ఉప ఎన్నికలైనా, స్థానిక ఎన్నికలైనా అధికార పార్టీకి వుండే ‘ఎడ్జ్‌’ ప్రత్యేకం. మొన్న నంద్యాల ఉప ఎన్నిక ఫలితమైనా, నేడు కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నిక ఫలితమైనా.. అధికార పార్టీకి వ్యతిరేకంగా వస్తే, అదో సెన్సేషన్‌. ప్రతిపక్షం వెనుకబడటం అనేది సాధారణమైన వార్తే. ఎట్‌ ది సేమ్‌ టైమ్‌ అధికార పార్టీ విజయం సాధించడమూ సాధారణమైన వార్తగానే భావించాలేమో.!

కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి మెజార్టీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేస్తోంది. ప్రతిపక్షం వైఎస్సార్సీపీ పెద్దగా అధికార పార్టీకి పోటీ ఇచ్చినట్లు కన్పించడంలేదు. అయితే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోదరుడి తనయుడ్ని ఓడించడంలో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం సాధించడం గమనార్హమిక్కడ.

సదరు ఎమ్మెల్యే మొత్తంగా తన బలాన్నంతా 22వ డివిజన్‌ మీద ఫోకస్‌ పెట్టినా ప్రయోజనం లేకుండాపోయింది. టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు సోదరుడి కుమారుడు శివకుమార్‌పై, వైఎస్సార్సీపీ అభ్యర్థి కిషోర్‌ ఘనవిజయాన్ని అందుకున్నారు. మరో డివిజన్‌నీ కైవసం చేసుకుంది వైఎస్సార్సీపీ. టీడీపీ 13కి పైగా డివిజన్లలో విజయం సాధించింది. ఇది ఉదయం 10 గంటల నాటి పరిస్థితి. మరో 2 గంటల్లోనే పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి.

మొత్తంగా ఫలితాలు ఇందుకు భిన్నంగా వుండే అవకాశాలైతే లేవు. మెజార్టీ స్థానాలు టీడీపీ – బీజేపీ కూటమి కైవసం చేసుకోనుండడంతో కాకినాడ మేయర్‌ పదవి తెలుగుదేశం పార్టీ వశం కావడం లాంఛనమే కావొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *