స్థానిక ఆలయాల ప్రశస్త్యాన్ని, స్థల పురాణాన్ని విస్తృత ప్రచారం చేసి టూరిజం, ఆర్టీసీ శాఖలను సమన్వయం చేసుకుని భక్తుల సంఖ్య పెంచేలా ప్రణాళికలు తయారు చేయాలని టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలన భవనంలోని చాంబర్లో మంగళవారం స్థానిక ఆలయాల కార్యకలాపాలపై అధికారులతో ఈవో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి స్థానిక ఆలయాలకు సంబంధించిన స్థల పురాణం, ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ టిటిడి వెబ్సైట్, ఎస్వీబీసిలో ప్రచారం నిర్వహించాలన్నారు. తిరుపతిలోని పద్మావతి నిలయం, శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సముదాయాలతో పాటు ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్లో ఈ ఆలయాల గురించి భక్తులకు తెలిసేలా ప్రచారం ఏర్పాట్లు చేయాలన్నారు. టూరిజం, ఆర్టీసీ అధికారులతో సంప్రదించి ప్యాకేజి టూర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక ఆలయాల్లో అవసరాలను బట్టి సేవలు ప్రవేశపెట్టే అవకాశాలు పరిశీలించాలన్నారు. ప్రతి ఆలయానికి సంబంధించి ఒక బుక్ తయారు చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు.
అప్పలాయగుంట, శ్రీనివాసమంగాపురం ఆలయాల్లో కళ్యాణ కట్టలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. టిటిడి అనుబంధ, విలీన ఆలయాలకు చెందిన వ్యవసాయ భూములు ఖాళీగా ఉంచరాదన్నారు. ఈ భూములను ఎప్పటికప్పుడు లీజుకు ఇచ్చే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రైతులతో సంప్రదించి సేంద్రియ ఎరువులతో పంటలు పండించి వాటిని తిరుమల ఆలయంలో ప్రసాదాల తయారీకి అందించేలా చూడాలన్నారు. ఆలయాలకు కానుకగా వచ్చే గోవుల సంరక్షణకు తగిన ఏర్పాట్లు చేసి వాటి ద్వారా వచ్చే పాలను గో సంరక్షణ శాలకు చేరవేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. విలీన ఆలయాలలో ఆదాయం, ఖర్చుకు వ్యత్యాసం లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు. ఆలయాల అవసరాలను బట్టి ఎంత మంది ఉద్యోగులు ఉండాలో ఎఫ్ఏ అండ్ సిఎవోతో సంప్రదించి నిబంధనలు తయారు చేయాలన్నారు. ఆలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనవసరంగా కొత్త భవనాలు కట్టకుండా ఉన్నవి వినియోగించు కోవాలన్నారు. స్థానిక ఆలయాలు, విలీన ఆలయాలకు సంబంధించి మంజూరు చేసిన అభివృద్ధి పనుల వివరాలు డెప్యూటీ ఈవోలకు తెలియచేయాలన్నారు. మంజూరైన అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయాల ఆదాయం, భక్తుల సంఖ్యను బట్టి గ్రేడ్లుగా విభజించాలన్నారు.
తిరుమల ఘాట్‌రోడ్‌లోని వినాయక ఆలయంలోని సిమెంట్ విగ్రహం స్థానంలో రాతి విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. ఆలయం చుట్టూ పూల మొక్కలు పెంచి భక్తులకు ఆహ్లాద వాతావరణం కల్పించాలన్నారు. జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎఫ్ఏ అండ్ సిఎవో శ్రీ బాలాజి, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్టేట్ అధికారి శ్రీమల్లిఖార్జున, డెప్యూటీ ఈవోలు శ్రీమతి కస్తూరి బాయి, శ్రీమతి శాంతి, శ్రీమతి పార్వతి, శ్రీ రాజేంద్రుడు, శ్రీ సుబ్రమణ్యం, శ్రీ రమణ ప్రసాద్, శ్రీ దామోదరం పాల్గొన్నారు.