డిసెంబరు లోగా జిల్లాలో టిడ్కో ఫేజ్-1, ఫేజ్-2 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై నాగలక్ష్మి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్ల విషయంలో అధికారులు అలసత్వం వీడాలన్నారు. నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకుని పనులను వేగవంతం చేయాలన్నారు.
అనంతరం జగనన్న ఇల్లు పొందిన కారణంగా టిడ్కో ఇల్లు రిజెక్ట్ అయిన లబ్ధిదారుల స్థానంలో కొత్త లబ్ధిదారులను అన్వేషించి వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.
టిడ్కో కాలనీలలో మౌలిక వసతుల కల్పన కోసం టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. టిడ్కో ఇళ్లకోసం బ్యాంకులను సంప్రదించి లోన్లు అందించే ప్రక్రియ పూర్తి చేయడంలో మెప్మా అధికారులు సహకరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఆర్డీ పీవీవీఎస్ మూర్తి, టిడ్కో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్యామ్ సుందర్, మెప్మా పీడీ విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
_