తీవ్రంగా నష్టపోతున్నా రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి…రామకృష్ణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
కరువుతో అల్లాడుతున్న జిల్లా రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి సీఎం జగన్, వ్యవసాయశాఖ మంత్రి, అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో నివేదికలు అంచనా వేయాలి. వేరుశెనగ పంట పొలాల పరిశీలనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.
అనంతపురం జిల్లాలో నిర్ణీత సమయంలో వర్షాలు కురిసినా పంట కాయదశకు వచ్చే తరుణంలో వరుణుడు మొహం చాటేయడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం గ్రామానికి చెందిన కౌలు రైతు కాట్నేకాలువ నారాయణ పొలంలోని వేరుశెనగ పొలాన్ని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యాదర్శులు చిరుతల మల్లికార్జున, కాటమయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వేమయ్యయాదవ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తదితరులతో కలిసి పరిశీలించారు.
అనంతపురం జిల్లాలో ప్రతిఏటా వేరుశెనగ 7 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా కేవలం 4.50లక్షల హెక్టార్లలో మాత్రమే ఈ ఏడాది ఖరీఫ్ లో సాగుచేశారని, అయితే నిర్ణీత సమయంలో వర్షాలు కురవకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయని, చెట్టుకు కనీసం ఐదారు కాయలు కూడా కాయలేదంటే బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎకరాకు దాదాపు రూ.30వేలు పెట్టుబడి పెడితే కనీసం వేరుశెనగ కట్టె కూడా చేతికందే స్థితిలో లేకపోవడంతో అత్యంత దయనీయమన్నారు. సకాలంలో వర్షాలు వచ్చాయని.. పంటలు విరివిగా పండుతాయనే ఆశ ఉండేదని, అయితే దురదృష్టవశాత్తు వరుణుడు కరుణించకపోవడంతో జిల్లాలో పంట పూర్తిగా ఎండుముఖం పట్టడంతోపాటు కంది పంట కూడా పూర్తిగా ఎండిపోవడం బాధకలుగుతోందన్నారు.
పెట్టిన పెట్టుబడి కూడా చేతికందదని బ్యాంకుల్లో తెచ్చుకున్న రుణాలు కూడా కట్టలేని పరిస్థితి రైతులకు నెలకొందన్నారు. కోస్తా, తెలంగాణ, హైదరాబాదు ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు కురుస్తూ అన్ని వర్గాల నష్టపోతున్నారని, ఇక్కడ భిన్నంగా వర్షాలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని.. వ్యవసాయశాఖ మంత్రి, వ్యవసాయాధికారులను అనంతపురం, కర్నూలు జిల్లాలకు పంపి క్షేత్రస్థాయిలో పంట నష్ట పరిహారం పై అంచనాలు వేయాలని రైతులను ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు.
తీవ్ర వర్షాభావంతో నష్టపోతున్న అనంతపురం జిల్లా రైతులను తక్షణమే ఆదుకోవాలని లేనిపక్షంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని, తక్షణమే సీఎం స్పందించాలనిన్నారు. ఆయా జిల్లాల్లో రెవెన్యూ అధికారులు కూడా తక్షణమే పంటలను పరిశీలించి నివేదికలను ప్రభుత్వానికి నివేదికలు పంపాలని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీపరంగా కనీసం రైతుల పక్షాన చేస్తున్న భారత్ బందుకు మద్దతివ్వకపోవడం బాధాకరమన్నారు.
ఈ ఏడాది ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమాను ఎలాంటి నియమ, నిబంధనలు లేకుండా మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, రాప్తాడు, అనంతపురం రూరల్ మండల కార్యదర్శులు సాకే నాగరాజు, రమేష్, ఏఐవైఎఫ్ రమణయ్య, గిరిజన సమాఖ్య రామాంజనేయులు, హంపాపురం ఎంపీటీసీ మోదుపల్లి రవికుమార్, మాజీ సర్పంచ్ గోపాల్, నంబూరి నాగరాజు, ప్రతాప్, నంబూరి మధు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాన్సన్ బాబు, ఏఐటియుసి నగర కార్యదర్శి రాజేష్, సిపిఐ రాప్తాడు నియోజకవర్గ నాయకులు శ్రీకాంత్, పాళ్యం ప్రసాద్, రవీంద్ర, వెంకటనారాయణ, శ్రీరాములు, నల్లప్ప, ప్రసాద్, చలపతి, మౌలాలి, రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ నాయకులు నరసింహ, కుల్లాయిస్వామి, మహేష్, వంశీ, మదన్ తదితరులు పాల్గొన్నారు.