ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు వ్యతిరేకంగా బాబు నిరసనలా. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు రాష్ట్రానికి శాపం. వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కె.పార్థసారథి వెల్లడి. జగన్ గారి చేతిలో చావుదెబ్బ తిన్నాక బాబు ఉన్మాదిలా మారాడు. బాబు లాంటి నీచ మనస్తత్వంతో రాజకీయాల్లో ఎవరూ ఉండరు. పెట్రోలుపై రూపాయి రోడ్ సెస్ విధిస్తే హైదరాబాద్ లో నిరసనలా బాబూ. అసలు ఎవరిమీద నీ పోరాటం. ఏ ప్రభుత్వంపై మీ నిరసన. ప్రెస్మీట్లో సూటిగా ప్రశ్నించిన వైయస్సార్సీపీ ఎమ్మెల్యే. ఎంతసేపూ స్వార్థ రాజకీయాలు చంద్రబాబు రైతు వ్యతిరేకి. వ్యవసాయం దండగ అని, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే, విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్నాడు.
చంద్రబాబుకు ఏనాడూ ప్రజల సంక్షేమం పట్టదు. ఎంతసేపూ స్వార్థ రాజకీయాలు తప్ప. విద్యుత్ ఛార్జీలపై ఉద్యమించిన రైతులపై కాల్పులు జరిపి, ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడు. బషీర్‌బాగ్ కాల్పులు జరిగి సరిగ్గా రేపటికి (28వ తేదీ శనివారం) 21 ఏళ్లు పూర్తవుతాయి.తొలి నుంచి చంద్రబాబు రైతు వ్యతిరేకిగా, ప్రజా వ్యతిరేకిగా ఆలోచనలు చేస్తున్నారు తప్ప, ప్రజలకు మేలు జరుగుతుంటే సంతోషపడిన దాఖలా లేదు. బషీర్‌బాగ్ కాల్పులను ఈనాటికి ప్రజలు మర్చిపోలేదు.
ఉన్మాదిలా మారాడు:
‘సీఎం శ్రీ వైయస్ జగన్ చేతిలో ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నాక, చంద్రబాబుకు మతి భ్రమించి ఒక ఉన్మాదిలా మారారు. ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పథకాలను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటుంటే, మేధావులు కూడా ప్రశంసిస్తుంటే.. వాటిని ఏ విధంగా అడ్డుకోవాలి. ఏ విధంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి. ప్రజలకు ఏ విధంగా మేలు జరగకుండా చూడాలి అని ఆలోచన చేస్తున్న నీచుడు చంద్రబాబు. రాజకీయాలలో ఇంత నీచమైన మనస్తత్వం ఉన్న వారు ఎవరూ ఉండరని నేను భావిస్తున్నాను’.
ప్రజలకు శాపం:
‘14 ఏళ్లు సీఎంగా ఉన్నానని గొప్పలు చెప్పుకునే వ్యక్తి, రాష్ట్రంలో ప్రజలకు ఇంత మేలు జరుగుతుంటే చూసి ఓర్వలేక తన టక్కు టమార విద్యలతో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాడు. తన లాయర్లు, తన పచ్చ పత్రికలతో ఈ ప్రభుత్వం మీద.. ఈ మంచి కార్యక్రమాలను ఆపండి అని కోర్టుల్లో కేసులు వేయించే దుస్థితి, దౌర్భాగ్యానికి చంద్రబాబునాయుడు దిగజారడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకు శాపంలా మారింది’.
పారిపోయి దాక్కున్నాడు:
‘చంద్రబాబునాయుడు ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలను గాలికి ఒదిలేసి పారిపోయి హైదరాబాద్‌లో దాక్కుంటున్నాడు. అధికారంలో ఉన్నప్పుడేమో.. హైదరాబాద్ రాజధానిగా 10 ఏళ్లు అవకాశం ఉన్నప్పటికీ, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి, తను చేసిన పాపాలకు రాత్రికి రాత్రి పారిపోయి వచ్చి ఇక్కడ, ఏదో పొడిచేస్తానని చెప్పి ఇక్క బస్సులో కూర్చుని నాటకాలాడాడు’. ‘ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో నాకు సంబంధం లేదు. ఈ రాష్ట్ర ప్రజలతో నాకు సంబంధం లేదని చెప్పి అక్కడికి పారిపోయి, అక్కడ దాక్కుని వీడియా కాన్ఫరెన్పుల్లో, జూమ్ కాన్ఫరెన్సుల్లో మాట్లాడుతూ కాలం గడుపుతున్నాడు’.
ఎవరిపై ధర్నా? దేని కోసం ధర్నా?:
‘రేపు (శనివారం) ఆయన హైదరాబాద్‌లో ధర్నా చేస్తాడట. ఏపీ ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై ఒక రూపాయి సెస్ విధిస్తే దాని మీద హైదరాబాద్‌లో కూర్చుని ధర్నా చేస్తాడట. అసలు ఆయన ఎవరి మీద ధర్నా చేస్తాడు?’.
‘తను రూ.2.5 లక్షల కోట్లు అప్పులు చేసి, దాంట్లో కనీసం 10 శాతం కూడా ప్రజలకు చేరకుండా అవినీతి ద్వారా పనికిమాలిన కార్యక్రమాలపై ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినందుకు ధర్నా చేస్తాడా.
తను అధికారంలో ఉన్నప్పుడు డీజిల్, పెట్రోల్ ధరలు ఎంత పెరిగాయో ఎప్పుడైనా ఆలోచించాడా?’.
‘తను అధికారంలో ఉన్నప్పుడు లీటర్ పెట్రోల్‌లో దాదాపు 30 రూపాయల వరకు ధరలు పెరిగినా, ఈ మహానుభావుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కనీసం ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కానీ, ధరలు తగ్గించమని తన మంత్రుల ద్వారా ఏమైనా ప్రయత్నం చేశాడా అని చెప్పి అడుగుతున్నాను నేను. రేపు ఎవరి మీద «ధర్నా చేయబోతున్నావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీదా. లేక తెలంగాణ ప్రభుత్వం మీదా. లేదా కేంద్ర ప్రభుత్వం మీదా అని నేను ప్రశ్నిస్తున్నాను’.
మీకు నిజంగా దమ్ముంటే..:
‘మీకు నిజంగా దమ్ముంటే, మీకు పాత నల్ల చొక్కాలు ఉన్నాయి. వాటిని అప్పుడప్పుడు ధర్నాలు చేసేవారు. కేంద్ర ప్రభుత్వం మీద నిరసన అంటూ కేంద్రం మీద దొంగ దీక్షలు చేసేవారు. మీకు దమ్ముంటే ఆ చొక్కాల దుమ్ము దులిపి వాటిని ధరించి ఢిల్లీ వీధుల్లో కేంద్ర ప్రభుత్వంపై ధర్నా చేయండి. పెట్రో ధరలు తగ్గించమని మోదీ ప్రభుత్వంపై «ఢిల్లీలో మీకు ధైర్యముంటే ధర్నా చేయమని అడుగుతున్నాను’.
ఒక్క పనైనా చేశారా?:
‘ఈరోజు పెట్రోల్‌పై ఒక రూపాయి సెస్ విధిస్తున్నందుకు ధర్నా చేస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు.. జగన్మోహన్రెడ్డి గారు అమలు చేసిన పథకాల్లో ఏనాడూ ఏ ఒక్క సంక్షేమ పథకం, కార్యక్రమం అమలు చేయలేదు.అమ్మ ఒడి కానీ, ఆసరా కానీ, విద్యా దీవెన కానీ, విద్యాకానుక కానీ.. ఇలా ఏ ఒక్కటైనా అమలు చేశాడా అని నేను అడుగుతున్నాను’. ‘రూ.2.5 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబునాయుడు ప్రజలకు నేరుగా మేలు జరిగే ఒక్క కార్యక్రమమైనా చేశాడా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎంతసేపూ అవినీతి ద్వారా తను, తన తాబేదార్లు జేబులు నింపుకోవడం తప్పితే ఆ అప్పు వల్ల ఈ రాష్ట్రానికి ఒక్క రూపాయి అయినా మేలు జరిగిందా అని నేను ప్రశ్నిస్తున్నాను’.
కానీ మేం చేసి చూపాం:
‘ఈరోజు మేము గర్వంగా చెప్పుకోగలం. మా ప్రభుత్వం, మా జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు నేరుగా లక్షా 4 వేల 241 కోట్లు ఒక్క పైసా అవినీతి లేకుండా డైరెక్టుగా బ్యాంకుల ద్వారా కోట్ల మంది ప్రజల ఖాతాలలో నేరుగా జమ చేశాం. దీనికి అదనంగా పరోక్షంగా మరో రూ.36 వేల కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం కలిగిందని మనవి చేస్తున్నాను. ఆ విధంగా ప్రజల జీవితాలకు భరోసా కల్పించడం చంద్రబాబుకు తెలియడం లేదా’.
ఓర్వలేక కడుపు మంట:
‘ఈరోజు జగన్మోహన్రెడ్డి గారు ప్రవేశపెట్టిన వ్యవస్థలు గ్రామ సచివాలయాలు కానివ్వండి. వలంటీర్ల వ్యవస్థ కానివ్వండి. ఆర్బీకేలు కానివ్వండి.. అన్నింటినీ దేశంలోని ఎందరో నేతలు, ఎన్నో ప్రభుత్వాలు, అనేక పార్టీలు మెచ్చుకుంటుంటే చూసి ఓర్వలేని చంద్రబాబునాయుడు కడుపు మంటతో వాటన్నింటినీ ఆపాలని ఎలా ప్రయత్నిస్తున్నాడో ప్రజలంతా అర్ధం చేసుకోవాలి’.
చంద్రబాబు ధర్నా వారికి వ్యతిరేకం:
‘చంద్రబాబు చేస్తున్న ఈ ధర్నా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, విద్యార్థులకు వ్యతిరేకమని నేను గట్టిగా చెబుతున్నాను. ఎందుకంటే, ఎంత దౌర్భాగ్యం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ కార్యక్రమాలు చేయకూడదు. ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాలు ఆగిపోవాలి. ప్రభుత్వానికి ఆదాయం రావొద్దు. ఆదాయం లేక ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోవాలి. ఇది చంద్రబాబునాయుడు కుట్ర’. ‘ఈ రాష్ట్రానికి ఆదాయం ఆగిపోతే అమ్మ ఒడి ద్వారా రాష్ట్రంలో దాదాపు 45 లక్షల తల్లులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆసరా ద్వారా దాదాపు 90 లక్షల మందికి రుణమాఫీ ఉండదు. లక్షల మంది మహిళలు, రైతులు, విద్యార్థులకు ఏవీ అందకూడదు. ఏ పథకాలు అమలు కాకూడదన్న ఉద్దేశంతో ఎన్ని కుట్రలు పన్నుతున్నాడో ఒకసారి ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను’.
అంతటి పాపాత్ముడు:
‘తన సొంత ఎమ్మెల్యేల ద్వారా, తన సొంత లాయర్ల తో ఏ విధంగా ఫిర్యాదులు చేయిస్తున్నాడో చూస్తున్నాం. ఆర్బీఐకి కంప్లైంట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తారు. బ్యాంకర్ల దగ్గరకు వెళ్లి వారికి అప్పులు ఇవ్వొద్దని చెబుతారు. పారిశ్రామికవేత్తల దగ్గరకు వెళ్లి, ఈ ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ, ఇక్కడి పరిస్థితులపై అబద్దాలు చెబుతూ, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇంత కుట్ర చేసే రాజకీయ నాయకుడు, పాపాత్ముడు ఈ దేశంలో ఇంకెవరూ లేరని మనవి చేస్తున్నాను’.
చిత్తశుద్ధితో సీఎం:
‘ఈరోజు మనందరికీ తెలుసు. ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తమైపోయిందో. ఉపాధి లేకుండా ప్రజలు, ఆదాయం లేకుండా ప్రభుత్వాలు నానా ఇబ్బంది పడుతున్నాయి. ఇన్ని సమస్యలున్నా, రాష్ట్ర ఆదాయం పడిపోయినా, కేంద్ర ప్రభుత్వం నుంచి హక్కుగా రావాల్సిన జీఎస్టీలో వాటా రాకపోయినా కూడా ఇచ్చిన మాటకు కట్టుబడిన సీఎం శ్రీ వైయస్ జగన్, పేద ప్రజలకు మేలు చేయడం కోసం కంకణబద్దులై ఉన్నారని ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ప్రపంచమంతా కూడా గుర్తించిందని మనవి చేస్తున్నాను’. ‘కరోనాతో ఉపాధి కోల్పోయి, ఆదాయం లేక ఎన్నో కుటుంబాలు చాలా ఇబ్బంది పడిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ రాష్ట్రంలో ఒక్క కుటుంబం కూడా ఉపాథి లేక ఆర్థికంగా ఇబ్బంది పడలేదంటే అతిశయోక్తి కాదు.’
విషం చిమ్ముతున్నారు:
‘ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మేలు కోసం అప్పులు చేస్తే చంద్రబాబు నాయుడు ఏ విధంగా విషం చిమ్ముతున్నాడో చూడాలని మనవి చేస్తున్నాను’. ‘ఆరోజు చంద్రబాబునాయుడు పెట్రోల్, డీజిల్ మీద ఒకేసారి రూ.4 పెంచాడు. కానీ ఏం కార్యక్రమం చేశాడని అడుగుతున్నాను. బెంజ్ సర్కిల్లో ఖాళీ కుర్చీలతో నవనిర్మాణ దీక్షలు. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్రెడ్డి గారు ఆందోళన చేస్తున్నారని తెలిసి, తనపై ప్రజలందరూ ఉమ్మేస్తారని భావించి ఆరోజు నల్ల చొక్కాలు వేసుకుని నిరసన దీక్షలు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి విదేశీ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు. అవి తప్పితే ఈ రాష్ట్రానికి ఏదైనా ఆస్తి ఏర్పాటు చేశావా. పేదవాడి కడుపు నింపడానికి ఏదైనా కార్యక్రమం చేశావా అని చెప్పి అడుగుతున్నాను’.
ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి:
‘అన్న క్యాంటీన్ల గురించి చెబుతారు. మీకు, మీ టీడీపీ నాయకులకు దమ్ముంటే చెప్పండి. ఈ రాష్ట్రంలో ఆ క్యాంటీన్ల ద్వారా ఎంత మందికి భోజనం పెట్టారు. ఎన్ని క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అన్నీ అరకొర చేసి, ప్రజలను మభ్యపెట్టి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన విషయం వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను’.
రూపాయి సెస్ ఎందుకంటే?:
‘పెట్రోల్‌పై రూపాయి సెస్ ఎందుకు విధిస్తున్నామన్నది కూడా మేము చెబుతున్నాం. చందబాబు అయిదేళ్లు రూ.2.5 లక్షల కోట్లు అప్పులు చేసి, ఒక్క కొత్త రోడ్ వేయలేదు. ఉన్న రోడ్లు మరమ్మతులు చేయలేదు. దీంతో ఆ అయిదేళ్లలో రాష్ట్రంలో రహదారులు దారుణంగా మారాయి. మరోవైపు గత రెండేళ్లుగా భారీగా వర్షాలు పడ్డాయి. దాంతో రోడ్లు మరింత దెబ్బ తిన్నాయి. ఇది వాస్తవం. మేము వాస్తవాలను దాచి, మీ మాదిరిగా ప్రజలను మోసం చేసే ప్రభుత్వం కాదు మాది’. ‘జగన్మోహన్రెడ్డి గారు చిత్తశుద్ధి ఉన్న నేత. ఆయన చిత్తశుద్ధితో పరిపాలిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో ఉన్న సమస్యలను ప్రజలకు చెప్పి, వాటి పరిష్కారం కోసం ప్రయత్నించే వ్యక్తి జగన్మోహన్రెడ్డి గారు. ఆ ఒక్క రూపాయి సెస్‌తో వచ్చే ఆదాయంతో ఈ రోడ్లు బాగు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది తప్పా అని నేను అడుగుతున్నాను’.
‘నీవు నాలుగు రూపాయలు పెంచినప్పుడు లేని బాధ, ఇవాళ ఒక ప్రత్యేక లక్ష్యం, ఒక మంచి ఉద్దేశం, ప్రజల మేలు కోసం ఒక రూపాయి సెస్ విధిస్తే ఇంత యాగీ చేస్తున్నావే.. ఆరోజు నీకు నాలుగు రూపాయలు పెంచి, పెట్రో ధరలు పెరిగాయి కాబట్టి, ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచలేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను’.
‘ఇవాళ డీజిల్ ధరలు పెరిగినా జగన్మోహన్రెడ్డి గారు ఎక్కడా పన్నులు వేయలేదు, పన్నులు విధించి అది మీ కోసమే చేస్తున్నానని ప్రజలకు చెప్పలేదు. రేట్లు పెరిగినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి జగన్మోహన్రెడ్డి గారు అని మనవి చేస్తున్నాను’.
ఆ ఎంపీలతో లాబీ చేయొచ్చు కదా?:
‘నీవు ఆరోజు రాజకీయ కుట్రతో నీ పార్టీకి చెందిన ఎంపీలను బీజేపీకి అమ్మేశావు. నీకు దమ్ముంటే వాళ్లతో ఇవాళ లాబీ చేయి. నీవు వారిని ఆ పార్టీలోకి ఎందుకు పంపించావన్నది ప్రజలందరికీ తెలుసు. నీ పాపాలు కడుగుతారని, నీవు జైలుపాలు కాకుండా కాపాడతారని, ఏదో స్వార్ధంతోనే నీవు వారిని ఆ పార్టీలోకి పంపించావు. కనీసం ఈరోజైనా వారి ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం కోసం ప్రయత్నం చేయమని మనవి చేస్తున్నాను’.
కుట్రలు కుతంత్రాలు:
‘ఈ రెండున్నర ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాల్జేయడానికి, ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఏ విధంగా మేలు జరుగుతుందో.. వాటిని అడ్డుకోవడం కోసం పాపాత్ముడైన చంద్రబాబునాయుడు ఈ పాప కార్యాలన్నింటినీ లాయర్ల ద్వారా కానివ్వండి, కోర్టుల ద్వారా కానివ్వండి, ఆర్బీఐకి, కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని మనవి చేస్తున్నాను’. ‘మరోవైపు ప్రభుత్వంపై బురద చల్లడానికి అవకాశం లేక. ఎన్నికల్లో ఇచ్చిన హామీ తూచ తప్పకుండా అమలు చేస్తున్నందువల్ల, ఏం చేయాలో దిక్కు తోచక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న చంద్రబాబు కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు’.
ప్రతిదీ రాజకీయమే:
‘మొన్న గుంటూరులో ఒక దళిత బిడ్డ హత్యకు గురైంది, అది అత్యంత బాధాకరం. ఒక ఉన్మాది ఆ బిడ్డను బలి తీసుకుంటే, దాన్ని ప్రభుత్వానికి ఆపాదించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగత ఘటనలను కూడా ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. నిజానికి అలాంటి ఘటనలను నిరోధించడానికి, నిందితులకు కఠిన శిక్షలు పడడం కోసమే దిశ వంటి చట్టం తీసుకురావడం జరిగింది’.
దళితులపై దాడి అంటే ఇదీ..:
‘నీవు చెబుతున్నట్లు దళితుల మీద దాడి అంటే.. దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని నీవు అన్నట్లు. దళితులు పండ్లు కూడా తోముకోరని మీ మంత్రి అన్నారు. దళితులు స్నానం కూడా చేయరని మీ మంత్రులు అన్నారు. అది దళితుల మీద దాడి అంటే’.
మతాల మధ్య చిచ్చుకు యత్నం:
‘మరోవైపు మతాల మధ్య కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఈ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకం అని ముద్ర వేసేందుకు ఎవరు దేవతా విగ్రహాలను «ధ్వంసం చేశారో ఆ దేవుళ్లకు తెలుసు. వారికి ఆ భగవంతుడు తప్పకుండా శిక్షలు వేస్తాడు. దాన్ని కూడా రాజకీయం చేసి, ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబునాయుడు ప్రయత్నించాడన్నది ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు’.
హిందూ మతం కోసం:
‘ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నింటికీ ఈ ప్రభుత్వం మాదిరిగా గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) ద్వారా ఎవరు అడిగినా కాదనకుండా రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశారు. ఆలయాల పునరుద్దరణ కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. హిందూమతం సంక్షేమం కోసం జగన్మోహన్రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు’. చివరగా.. ‘పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం బాధాకరం. కానీ అందులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమిటన్నది ప్రజలు అర్ధం చేసుకోవాలి. ఇప్పటికైనా చంద్రబాబునాయుడు బుద్ధి తెచ్చుకుని ప్రజలు ఎందుకు ఛీత్కరించారో తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను’.. అని ఎమ్మెల్యే కె.పార్థసారథి అన్నారు.