అనంతపురం సబ్ డివిజన్ పోలీసు అధికారులతో ఎస్పీ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నెలవారి నేర సమీక్ష. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడకుండా చర్యలు తీసుకోండి. ఇసుక, ఇతర రాష్ట్రాల మద్యం కట్టడికి చర్యలు తీసుకోండి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన మట్కా, గుట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ లపై నిఘా పెట్టండి. ఫ్యాక్సనిస్టులు, వారి అనుచరుల కదలికలుపై నిరంతర నిఘా కొనసాగించాలి.
మహిళలపై జరిగే నేరాలను కట్టడి చేయడంతో పాటు ఈ నేరాల్లో వేగవంతంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం ఆయన అనంతపురం సబ్ డివిజన్ అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రేవ్ యు.ఐ కేసులు, ఎస్సీ/ఎస్టీ యు.ఐ కేసులు, నాన్ గ్రేవ్ , మిస్సింగ్ , 174 crpc, ఎన్ఫోర్స్మెంట్ , జాతీయ/ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ , ఎస్సీ ఎస్టీ కమీషన్ , మహిళా కమీషన్ మరియు కోర్టు సంబంధిత సమలపై సమీక్ష చేశారు.
ఈ కేసుల స్థితిగతులు, పురోగతిపై ఆరా తీశారు. ఆయా కేసుల ఛేదింపునకు మెలకువలు, దిశానిర్ధేశం చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… నిందితుల అరెస్టుల విషయంలో నిబంధనలు తు.చ తప్పకుండా పాటించాలన్నారు. చట్టాలు అనుసరించి మాత్రమే నిందితులను అరెస్టు చేయాలి. ఏమాత్రం అతిక్రమించినా చర్యలు తప్పవు. అక్రమ నిర్బంధం, తదితర చట్ట విరుద్ధమైన పనులు చేయరాదు. నిందితుల అరెస్టు సందర్భంగా తీసుకోవాల్సిన చట్టపరమైన సూచనలు వివరించారు. పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకలిగేలా సిబ్బంది పనితీరు ఉండాలి. అవినీతికి దూరంగా ఉండాలి.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ లను అణచి వేయాలి. జిల్లాలో ఎక్కడా కూడా గుట్కా, అక్రమ మద్యం విక్రయాలు… ఇసుక అక్రమ రవాణా కొనసాగరాదు. పోలీసు స్టేషన్లకు వచ్చే స్పందన పిటీషనర్ల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. ప్రజల సమస్యలను విని సత్వరమే పరిష్కరించాలి. ఫ్యాక్సన్ కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఫ్యాక్సనిస్టులు, వారి అనుచరుల కదలికలుపై నిరంతర నిఘా పెట్టాలి. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. దొంగతనాలు, దోపిడీలు, తదితర నేరాల నియంత్రణకు కృషి చేయాలి.
ఎస్సీ ఎస్టీ వర్గాలు, మహిళల రక్షణ ముఖ్యంగా భావించాలి. కీలక కేసుల్లో ఘటనా స్థలంలోని ఆధారాలు సక్రమంగా, శాస్త్రీయ పద్ధతులలో సేకరించి దర్యాప్తు సమగ్రంగా చేపట్టాలి. అప్పుడే నిందితులకు శిక్షలు పడే అవకాశముంది. సాంకేతికతను విరివిగా వినియోగించుకోవాలి. రోడ్డు భద్రతపై దృష్టి పెట్టి రోడ్డు ప్రమాదాలు నివారించాలి. పోలీసు విధుల్లో పారదర్శకత, అంకితభావం, నిష్పక్షపాతం ముఖ్యం. అనంతపురం డీఎస్పీ జి.రాఘవరెడ్డితో పాటు సి.ఐ లు, ఎస్సైలు ఆయా పోలీసు స్టేషన్లు/ కార్యాలయాల నుండి పాల్గొన్నారు.