అన్ని వర్గాలకు రాజ్యాధికారాన్ని పంచారు. సామాజిక న్యాయం అంటే ఏంటో చూపించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం. అక్కసుతోనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మూడేళ్ల పాలనలో ఒకవైపు సంక్షేమం..మరో వైపు అభివృద్ధిని నడిపిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అనంతపురం జిల్లా ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వైస్సార్సిపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
ముందుగా మండల కార్యాలయం ఆవరణ నుండి వైస్సార్ సర్కిల్ వరకూ ర్యాలీ జరిపారు. అక్కడ దివంగత మహానేత, వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో జగన్ రూపొందించిన మేనిఫెస్టోలో ప్రజలకు మొత్తం 129 హామీలు ఇచ్చారని అవి దాదాపు పూర్తిగా అమలయ్యాయన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ళ ఏళ్ల కాలంలోనే ఏకంగా 95 శాతం హామీలను నెరవేర్చి… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం దక్కించుకున్నారని పేర్కొన్నారు.ఇది దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేకపోయారన్నారు.మూడేళ్లలో రాష్ట్ర ప్రజలకు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా రూ.1.70 లక్షల కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని, ఈ మొత్తంలో ఒక్క నగదు బదిలీ ద్వారానే ప్రజలకు లబ్ధి చేకూరిందని వెల్లడించారు.
మహిళా మణులకే ఏకంగా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధి చేకూరిందని, ఇది చరిత్రలో నిలిచిపోయే అంశమని చెప్పారు. ప్రజలకు ఏ కష్టం రాకుండా తమ ప్రభుత్వం కాపాడుతోందని చెప్పారు. అంతేకాక ప్రతి అవసరానికి తానున్నానంటూ సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూర్చారన్నారు.
ఈ మూడేళ్ళలో ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలోని ప్రజలకే వివిధ పథకాల ద్వారా వందల కోట్లు ఆర్థిక చేయూత అందించారని మాజీ ఎమ్మెల్యే వివరించారు.ఇది రాష్ట్ర చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయమన్నారు. ప్రతిపక్షాలు తమ ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలను పట్టించుకోనవసరం లేదని అని కేవలం అక్కసుతో.. అసూయతో విమర్శలు చేస్తున్నాయన్నారు.
అన్ని వర్గాలకు రాజ్యాధికారాన్ని పంచారు
జగన్ తన మూడేళ్ళ పాలనలో వెనుకబడిన వర్గాలకు, దళిత వర్గాలకు, నిమ్నజాతులు, క్రిష్టియన్, మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన నమ్మకం, అండదండలు ఏ సీఎం ఇవ్వలేదన్నారు.సామాజిక న్యాయం అంటే ఏంటో చూపించాడని పేర్కొన్నారు. అంతేకాక కార్పొరేషన్లు ద్వారా వెనుకబడిన వర్గాలకు నామినేట్ పదవులు ఇచ్చారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నాయన్నారు.
సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం..
గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమాన్ని అందించామని చెప్పారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్ సాకారం చేశారని చెప్పారు. నిజాయతీ, నిబద్ధతతో కూడిన వ్యవస్థను రూపొందించారని విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.