ప్రతి ఒక్కరూ సేవాభావంతో పనిచేయండి

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి ముంగింటికే సంక్షేమ ఫలాలను అందించాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేశారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని సున్నపు వీధిలో ఉన్న 19వ సచివాలయంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సచివాలయంలోని వాలంటీర్, సచివాలయ సిబ్బంది అటెండెన్స్ రిజిష్టర్ ను పరిశీలించారు. అనంతరం పింఛన్,వైయస్సార్ చేయూత,జగనన్న ఇళ్ళ నిర్మాణం పథకాలపై ఆరాతీశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనకు ఇచ్చిన గొప్ప ఆస్తి ఇళ్ళ పట్టాలు అని,ప్రతి ఒక్కరూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. గృహ నిర్మాణాలపై లబ్ధిదారులకు తెలియజేసే బాధ్యత వాలంటీర్, సచివాలయ సిబ్బందికి ఉన్నదన్నారు.

జగనన్న ఇంటి నిర్మాణం కొరకు ప్రభుత్వమే ఇసుక, సిమేంట్ను సమకూరుస్తుందని ప్రజలకు తెలియజెప్పాలన్నారు. జగనన్న కాలనీల్లో త్రాగునీరు, రోడ్లు నిర్మాణం,అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణాలతో పాటు అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. కరోనా థర్డ్ వేవ్ వస్తుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో పారిశుధ్యం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్యం వహించకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మాస్క్ ను తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి అనే సదుద్దేశంతో సేవాభావంతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు ను తీసుకురావాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, కార్పొరేటర్ బాబా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.