ప్ర‌పంచ మాన‌వాళికి ఆర్థిక ఇబ్బందులు తొల‌గిపోవాలి – టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

శాస్త్రోక్తంగా ముగిసిన క‌న‌కాంబ‌ర స‌హిత కోటి మ‌ల్లెపుష్ప మ‌హాయాగం. శ్రీ మ‌హాల‌క్ష్మి అవ‌తార‌మైన శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ టిటిడి నిర్వ‌హించిన క‌న‌కాంబ‌ర స‌హిత కోటి మ‌ల్లెపుష్ప మ‌హాయాగం వ‌ల‌న క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచ మాన‌వాళికి త‌లెత్తిన ఆర్థిక ఇబ్బందుల‌ను తొల‌గిపోయి లోకం సుభిక్షంగా ఉండాల‌ని ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆకాంక్షించారు. తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ఈ మ‌హాయాగం శ‌నివారం ఉద‌యం శాస్త్రోక్తంగా ముగిసింది.

ఉద‌యం సుప్ర‌భాతంతో అమ్మ‌వారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వ‌హించారు. ఉద‌యం 8.30 గంట‌లకు ఆల‌యంలోని శ్రీ కృష్ణ‌స్వామి ముఖ మండ‌పంలో అమ్మ‌వారిని వేంచేపు చేశారు. ఇందులో భాగంగా నిత్య హ‌వ‌నం, మ‌హా ప్రాయ‌శ్చిత హోమం, మ‌హా పూర్ణాహూతి, కుంభ ప్రోక్ష‌ణ నిర్వ‌హించారు.

అనంత‌రం ఆల‌యంలోని ఆశీర్వ‌చ‌న మండ‌పంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు, శ్రీ చ‌క్ర‌తాళ్వార్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్లు, పసుపు, చంద‌నంతో అభిషేకం చేశారు. త‌రువాత గంగాళంలో శ్రీ చ‌క్ర‌తాళ్వార్‌కు వేద మంత్రోచ్ఛార‌ణ‌ల న‌డుమ చ‌క్ర‌స్నానం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి మాట్లాడుతూ జూలై 16వ తేదీ నుండి జూలై 24వ తేదీ వ‌ర‌కు 9 రోజుల పాటు ఉద‌యం, సాయంత్రం రుత్వికులు ఈ యాగం నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. ఈ మ‌హాయాగాన్ని శ్రీ‌వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింద‌న్నారు. భ‌క్తులు త‌మ ఇళ్ల నుండి టీవీల ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో ఈ యాగంలో పాల్గొన్నార‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంప‌తులు, పాంచ‌రాత్ర ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల కృష్ణారెడ్డి, అర్చ‌కులు శ్రీ బాబు స్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్‌ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.