10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం: శ్రీ మల్లాది విష్ణు

అగ్రవర్ణ పేదలకు అండగా జగనన్న ప్రభుత్వం.

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రకటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి గారు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారు అన్నారు. విద్య, ఉద్యోగాల్లో ఈబీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. 33వ డివిజన్ శివాజీకేఫ్ సెంటర్ లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు గారు మాట్లాడుతూ.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సముచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రివర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సమాజంలోని అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలన్నదే జగనన్న ప్రభుత్వ ధ్యేయమని వెల్లడించారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యువతకు విద్య, ఉపాధి కల్పన విషయంలో ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. తాజాగా అగ్రవర్ణంలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారి ఉజ్వల భవిష్యత్తుకు మరోసారి బంగారు బాటలు వేయడమైనదన్నారు. దీని ద్వారా వారి జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నట్లు చెప్పుకొచ్చారు.

చంద్రబాబు తీరుతోనే గందరగోళం
తెలుగు ప్రజల్ని మోసం చేయడంలో చంద్రబాబు ఉద్ధండులని మల్లాది విష్ణు గారు అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు.. అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు రాజకీయ దురుద్దేశాలతో వ్యవహరించారని మండిపడ్డారు. ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు కేటాయించిన 10 శాతం కోటాను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా విభజించారన్నారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం రిజర్వేషన్ల స్ఫూర్తిని నాడు చంద్రబాబు దెబ్బతీశారన్నారు. చంద్రబాబు నిర్వాకంతో ఆర్థికంగా వెనుబడిన అగ్రకులాలు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.

ఈడబ్ల్యూఎస్‌ కోటాపై జగనన్న చిత్తశుద్ధి:
ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకువెళ్లారని మల్లాది విష్ణు గారు అన్నారు. ఈ అంశంపై గత కొంతకాలంగా వివిధ వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం జరిగిందన్నారు. న్యాయ నిపుణులతో చర్చించి వివాదాలకు తావులేని రీతిలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకు సమగ్ర కార్యాచరణ రూపొందించారన్నారు. అందులో భాగంగా మొదట విద్యావకాశాల్లో ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 జూలై 27న ఉత్తర్వులు జారీ చేశారన్నారు. దీనిపై మరింత కసరత్తు చేసిన అనంతరం సమగ్రంగా విధివిధానాలను నిర్ణయిస్తూ తాజాగా జీవో నెం.66 జారీ చేయడం జరిగిందన్నారు. ఈ రిజర్వేషన్ల కోటాలో మహిళలకు మూడోవంతు కోటా వర్తింపచేయడం శుభపరిణామమన్నారు. మరోవైపు కేంద్రం విధించిన పరిమితులు అన్నీ తొలగించి.. కేవలం రూ. 8 లక్షల్లోపు కుటుంబ వార్షికాదాయం మాత్రమే ఉండాలని జీవో ఇస్తే.. దానిపై కూడా గందరగోళం సృష్టించాలని తెలుగుదేశం నాయకులు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు.

నవంబర్ లో వైఎస్సార్ ఈబీసీ నేస్తం
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల కోసం ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పేరిట నవంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించనున్నట్లు మల్లాది విష్ణు గారు తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్‌ నేస్తం పథకం తరహాలోనే.. ఈబీసీ నేస్తం పేరుతో అగ్రవర్ణ పేద మహిళలకు చేయూతనందించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా.. 45 – 60 ఏళ్లలోపు వయసున్న వారికి ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్ల పాటు రూ.45 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ పథకాలను అర్హులైన అగ్రవర్ణ పేదలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీ శర్వాణి మూర్తి, శ్రీమతి పెనుమత్స శిరీష, స్థానిక నాయకులు రామలింగమూర్తి, రంగబాబు, మైలవరపు రాము, కమ్మిలి రత్న, గోపాలకృష్ణ, ధూపాటి శ్రీదేవి, ఓ.రాజశేఖర్, కూనపులి ఫణి, చాంద్ శర్మ, వై.సుధీర్ బాబు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.