అమరరాజా కంపెనీ తరలింపుపై ఎంపీ గల్లా జయదేవ్ కీలక ప్రకటన

తెలుగు దేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా కంపెనీ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి తరలిపోతున్నట్లు గత కొంత కాలంగా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరరాజా తరలింపుపై ఆ కంపెనీ కో ఫౌండర్, ఎంపీ గల్లా జయదేవ్ కీలక ప్రకటన చేశారు. చెన్నైకి అమరరాజా తరలింపు పూర్తిగా వదంతులు మాత్రమేనని, కంపెనీ ఇక్కడే ఉంటుందని తేల్చి చెప్పారు. ఇలాంటి వదంతులకు తాము స్పందించబోమని ఎంపీ గల్లా జయదేవ్‌ వ్యాఖ్యానించారు. వివాదాస్పద ప్రశ్నలకు దూరంగా ఉంటామని చెప్పారు.

అమరరాజా కంపెనీ తరలింపుపై గత నెల రోజులుగా పత్రికలు, చానళ్లలో ఓ వార్త వస్తోందని, మంచైనా చెడైనా ఇంత వరకూ దానిపై తాము స్పందించలేదని తెలిపారు. ఈ విషయం హైకోర్టు పరిధిలో ఉందని, కోర్టుకు సమాధానం చెబుతామని వెల్లడించారు. ఈ వ్యవహారంపై కోర్టు నిర్ణయం తర్వాత స్పందిస్తామని గల్లా జయదేవ్‌ వివరించారు.

ఇక, పీసీబీ ఆరోపణలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని, ఆ విషయం కోర్టు పరిధిలో ఉందని అమరరాజా గ్రూప్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు గల్లా రామచంద్రనాయుడు వెల్లడించారు. తమ ప్లాంట్లన్నీ గామాల్లోనే ఏర్పాటు చేశామని, వ్యవసాయ భూములను వాడలేదని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో ప్లాంట్లకు రూ. వందల కోట్లలో పెట్టుబడులు పెట్టామని, ప్రస్తుతం 20 మిలియన్‌ బ్యాటరీలను ఉత్పాదన చేస్తున్నామని ఆయన వివరించారు.

ఉద్యోగులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామని గల్లా రామచంద్రనాయుడు తెలిపారు. జిల్లాను, గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. పరిస్థితులను బట్టి ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 16 మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్లలో ఉత్పాదన కొనసాగుతోందన్నారు. తాను రాజకీయ వేత్తను కాదని, సామాజిక సేవకు మాత్రమే ప్రాధాన్యతనిస్తానని గల్లా రామచంద్రనాయుడు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.