బోర్డుల సమావేశంలో తెలంగాణ వాణి బలంగా వినిపించాలి: కేసీఆర్

నదీజలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటా కోసం నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లో బలమైన వాణి వినిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం నీటిపారుదల శాఖపై మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి.. బోర్డు సమావేశంలోని ఎజెండా అంశాలతోపాటు, రాష్ట్రం తరఫున ప్రస్తావించాల్సిన, లేవనెత్తాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించారు.

ఈ ఏడాది నుంచి కృష్ణా జలాల్లో చెరిసగం వాటా కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బోర్డుకు లేఖ రాసింది. ఈ అంశాన్ని కేఆర్‌ఎంబీ సమావేశ ఎజెండాలో చేర్చారు. అటు జలవిద్యుత్‌ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరాలపై చర్చించేందుకు కూడా ఎజెండాలో చేర్చారు. ఈ రెండింటితో పాటు ఇతర అంశాలకు సంబంధించి రాష్ట్రం పక్షాన వినిపించాల్సిన వాదనలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సమగ్ర సమాచారంతో సమావేశానికి వెళ్లాలని.. దశాబ్దాలుగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు న్యాయమైన, చట్టపరమైన అంశాల ఆధారంగా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా కోసం వాదనలు వినిపించాలని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణ మధ్య 70, 30 నిష్పత్తితో నీటిపంపిణీ సహా ఇతర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. వాస్తవాలన్నీ బోర్డు ముందు ఉంచాలని సీఎం అధికారులకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.