ప్రతి రోడ్డూ బాగుపడే వరకూ జనసేన గళమెత్తుతుంది… పవన్ కల్యాణ్

దెబ్బ తిన్న రోడ్లకు సంబంధించి అన్ని వివరాలనూ జన సైనికులు క్రోడీకరించాలి. ప్రతి రోడ్డూ బాగుపడే వరకూ జనసేన గళమెత్తుతుంది. రాష్ట్రంలో రహదారులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో జనసేన నాయకులు, శ్రేణులు ఏకబిగిన సామాజిక మాధ్యమాల్లో వెల్లడిస్తేనే వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరచి రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపై ఆలోచన మొదలుపెట్టింది. లక్షల మంది రహదారి కష్టాలను చెప్పారు. వర్షాలు తగ్గాక అక్టోబర్ తరవాత రోడ్డు మరమ్మతుల ప్రక్రియ మొదలుపెడతామని వైసీపీ ప్రభుత్వం వెల్లడించింది.

అప్పుడు టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లను నిర్ణయించి పనులు మొదలుపెట్టాలంటే సంక్రాంతి వస్తుంది. ఇక పనులెప్పుడు పూర్తవుతాయో? అప్పటి వరకూ ప్రజలకు ఈ గోతుల రోడ్లే గతి కావచ్చు. ఇప్పటి వరకూ రోడ్లపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి దృష్టి లేదు. నిజంగా శ్రద్ధ ఉంటే వర్షాకాలం ముగిసిన వెంటనే పనులు మొదలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసేవారు. ప్రతి జనసేన నాయకుడు, జన సైనికుడు తమ పరిధిలోని రోడ్లకు సంబంధించిన అన్ని వివరాలను క్రోడీకరించుకొని సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నాను. ఏ రోడ్డు ఎన్ని కిలో మీటర్ల మేర దెబ్బ తిని ఉంది, మరమ్మతులతో బాగు చేయవచ్చా, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలా లాంటి వివరాలను సేకరించండి. ప్రభుత్వం చెప్పిన విధంగా అక్టోబర్ తరవాత మీ పరిధిలోని రోడ్డుకు మోక్షం కలుగుతుందో లేదో చూసేందుకు, అభివృద్ధి చేయాల్సిన రోడ్డును మరమ్మతులతో సరిపెట్టే పక్షంలో ప్రశ్నించేందుకు ఈ వివరాలు అవసరం. జనసేన నాయకులు, శ్రేణులు సిద్ధం చేసే ఈ వివరాలతో ప్రతి రోడ్డూ బాగుపడే వరకూ జనసేన పార్టీ గళమెత్తుతుంది.

Leave A Reply

Your email address will not be published.