మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. నాపై నాగార్జున పోటీ చేస్తారంటే నమ్మను: ఎంపీ గల్లా జయదేవ్

మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. నాపై నాగార్జున పోటీ చేస్తారంటే నమ్మను: ఎంపీ గల్లా జయదేవ్

వైసీపీ అధినేత జగన్ ని ప్రముఖ సినీ నటుడు నాగార్జున ఈరోజు కలిసిన విషయం తెలిసిందే. జగన్ తో నాగార్జున భేటీ కావడంపై రాజకీయంగా చర్చలకు దారితీస్తోంది. వైసీపీ తరపున గుంటూరు నుంచి నాగార్జున పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై ప్రశ్నించిన విలేకరులకు ఆయన సమాధానమిస్తూ, ‘నాకు తెలియదు. నేను వైసీపీలో లేను. హైదరాబాద్ లో లేను. కాబట్టి దాని గురించి కామెంట్ చేయలేను’ అని అన్నారు.‘అక్కినేని నాగార్జున గుంటూరు నుంచి మీపై పోటీ చేస్తే..’ అనే ప్రశ్నకు గల్లా జయదేవ్ స్పందిస్తూ, ‘ఆయన వస్తాడని నేను అనుకోవట్లేదు. నేను, నాగార్జున మంచి ఫ్రెండ్స్. ఆయన ఏదైనా చేసేట్టయితే, నాతో మాట్లాడి చేస్తారు కాబట్టి, నేను నమ్మను’

కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కారు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం!

కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కారు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం!

కర్ణాటకలోని తుముకూరు వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి ప్రయాణిస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వస్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఎమ్మెల్యే రవికి స్వల్ప గాయమైంది. కొందరు వ్యక్తులు ఓ కారులో కొల్లూరు ఆలయాన్ని దర్శించుకుని బెంగళూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు చెందిన కారును ఈరోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో కునిగల్ వద్ద సదరు వాహనం ఢీకొట్టింది. దీంతో ఎదురుగా వస్తున్న కారులోని ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ విషయమై కర్ణాటక బీజేపీ విభాగం స్పందిస్తూ.. ప్రమాదం జరిగిన సమయంలో రవి కారును నడపలేదనీ, ఆయనకు మద్యం అలవాటు కూడా లేదని స్పష్టం చేసింది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేవరకూ ఎమ్మెల్యే రవి అక్కడే ఉన్నారని తెలిపింది. రవికి ఈ ప్రమాదంలో ఛాతీ భాగంలో గాయమయిందనీ, ఆయన సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం వెళ్లిపోయారని పేర్కొంది. మరోవైపు రవి కారును విచారణ నిమిత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రాహుల్, అఖిలేష్ భారత ఇంజినీర్లను అవమానించారు.. మోదీ

రాహుల్, అఖిలేష్ భారత ఇంజినీర్లను అవమానించారు.. మోదీ

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మరుసటి రోజే ఆ రైలు సాంకేతిక సమస్యలకు లోనయింది. దీనిపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. అలాగే ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా విమర్శనాత్మక ట్వీట్ చేశారు. దీనిపై నేడు ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకు పడ్డారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై విమర్శలు గుప్పించడం ద్వారా రాహుల్, అఖిలేష్ భారత ఇంజినీర్లను అవమానించారని మోదీ ఆరోపించారు.

ప్రతికూల వ్యాఖ్యలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, నైతిక స్థైర్యం కోల్పోవద్దని ప్రజలకు సూచించారు. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలును లక్ష్యంగా విమర్శలు చేయడం దారుణమన్నారు. ఈ ప్రాజెక్టులో భారత ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు భాగమని ఈ రైలును విమర్శించడమంటే.. వారిని అవమానించడమేనన్నారు. ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల శ్రమను దేశం గౌరవిస్తోందని.. వారు దేశానికి గర్వకారణమన్నారు.

ఏపీ టీడీపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు

ఏపీ టీడీపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు

ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ ఇప్పటికే దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏర్పాటు చేశారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో 15 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ గా కాలవ శ్రీనివాసులు, సభ్యులుగా అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస్, ఆనంద్ బాబు, ఫరూక్, కిడారి శ్రవణ్, మాణిక్యవరప్రసాద్, నిమ్మల రామానాయుడు, వాసుపల్లి గణేశ్, భూమా బ్రహ్మానందరెడ్డి, కుటుంబరావు, పంచుమర్తి అనూరాధ, శోభా స్వాతిరాణి, పి.కృష్ణయ్యలను నియమించారు. ఈ కమిటీ త్వరలోనే భేటీ కానుంది. కాగా, ఈ మేనిఫెస్టోలో సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్టు సమాచారం. రైతులు, మహిళలు, యువతకు పెద్ద పీట వేసే దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

వైఎస్ జగన్ ని కలిసిన అక్కినేని నాగార్జున

వైఎస్ జగన్ ని కలిసిన అక్కినేని నాగార్జున

వైసీపీ అధినేత జగన్ ని ప్రముఖ సినీ హీరో నాగార్జున కలిశారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసంలో జగన్ ని ఆయన కలిశారు. అయితే, ఏ విషయమై జగన్ ని నాగార్జున కలిశారన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, జగన్ తో నాగార్జున భేటీ సుమారు అరగంట సాగింది. సమావేశం ముగిసిన అనంతరం, జగన్ నివాసం నుంచి బయటకు వచ్చిన నాగార్జునను మీడియా పలకరించింది. అయితే, మీడియాతో నాగార్జున ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోవడం గమనార్హం.

నా కన్నా ముందే వైసీపీలో చేరాలని గంటా ప్రయత్నించారు: అవంతి శ్రీనివాస్

నా కన్నా ముందే వైసీపీలో చేరాలని గంటా ప్రయత్నించారు: అవంతి శ్రీనివాస్

ఏపీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస్ పై ఇటీవలే వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కన్నా ముందే వైసీపీలో చేరాలని గంటా ప్రయత్నించారని, తాను వైసీపీలో చేరడంతో ఆయన వెనక్కి తగ్గారని ఆరోపించారు. వైసీపీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు కానీ, తమ పార్టీలో ఖాళీలు ఉండాలిగా అని వ్యాఖ్యానించారు.

టీడీపీని వీడిన అవంతిపై ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకులతోనే విమర్శలు చేయించడంపై ప్రశ్నించగా, ‘అదే కదా దురదృష్టం. చంద్రబాబునాయుడు గారికి అదొక ఆనందం. వికృతమైన ఆనందం. ఈ రాష్ట్రంలో ఎవరూ కూడా ఆయన్ని ప్రశ్నించకూడదు. దళితులు ప్రశ్నిస్తే దళితులతో, కాపులు ప్రశ్నిస్తే కాపులతోనే ఆయన తిట్టిస్తారు. ప్రజలకు వాస్తవం ఏంటో తెలుసు. ఆంధ్రా ప్రజలు చాలా తెలివైన వాళ్లు. సమయం వచ్చినప్పుడు తీర్పును చాలా కరెక్టుగా ఇస్తారు’ అని నిప్పులు చెరిగారు.

నెక్ట్స్ వైసీపీలోకి ఫిరాయించేది ఓ కీలక మంత్రి... టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం!

నెక్ట్స్ వైసీపీలోకి ఫిరాయించేది ఓ కీలక మంత్రి… టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం!

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా ఉన్న వారు ఇప్పుడు జగన్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే మేడా మల్లికార్జున్ రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు వైసీపీ తీర్థం పుచ్చుకోగా, ఇప్పుడు ఏపీలో మరో నేత, మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తుండటం టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఆ నేత, ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో పోటీ చేయవద్దని చంద్రబాబు ఆదేశిస్తే, తాను వెనక్కు తగ్గుతానని వ్యాఖ్యానించడం కొత్త చర్చకు దారితీసింది. ఆయనకు ఈ దఫా టికెట్ ను ఆఫర్ చేయలేదని, అందువల్లే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ప్రస్తుతం కీలక మంత్రి పదవిలో ఉన్న ఆయన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే, టీడీపీకి నష్టం అధికమేనని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.34,550, విశాఖపట్నంలో రూ.34,550, ప్రొద్దుటూరులో రూ.34,000, చెన్నైలో రూ.33,430గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,990, విశాఖపట్నంలో రూ.31,780, ప్రొద్దుటూరులో రూ.31,490, చెన్నైలో రూ.31,960గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,500, విశాఖపట్నంలో రూ.41,400, ప్రొద్దుటూరులో రూ.41,500, చెన్నైలో రూ.43,600 వద్ద ముగిసింది.

ఒక్క చెంపదెబ్బతో జైషే చీఫ్ మసూద్ అజహర్ అన్నీ కక్కేశాడట!

ఒక్క చెంపదెబ్బతో జైషే చీఫ్ మసూద్ అజహర్ అన్నీ కక్కేశాడట!

మౌలానా మసూద్ అజహర్… కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు. భారత్ అంటే వల్లమాలిన ద్వేషం ప్రదర్శించే మసూద్ అజహర్ భారత్ లో అనేక ఉగ్రదాడులకు కారకుడు. కశ్మీర్ కోసం భారత్ ను అస్థిరతకు గురిచేయడమే అతడి ఏకైక అజెండా. అందుకోసం ఎంత దారుణానికైనా తెగిస్తాడు. అయితే ఇవన్నీ పైకి కనిపించే విషయాలేనని, వాస్తవానికి మసూద్ అజహర్ చాలా పిరికివాడని భారత ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. 1994లో పోర్చుగీస్ పాస్ పోర్టుతో బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించినప్పుడు భారత్ భద్రత బలగాలు అతడిని అరెస్ట్ చేశాయి. ఈ సందర్భంగా కస్టడీలోకి తీసుకున్న అధికారులు అతడ్ని సుదీర్ఘంగా ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు.

అయితే, ఇంటరాగేషన్ మొదలైన కొన్ని నిమిషాలకే అతడ్ని ఓ ఆర్మీ అధికారి గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు కళ్లు బైర్లు కమ్మిన మసూద్ అజహర్ అడిగినవీ, అడగనివీ అన్నీ చెప్పేశాడట. పాకిస్థాన్ భూభాగంపై స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఉగ్రసంస్థలు ఎలా పనిచేస్తాయో అన్నీ కూలంకషంగా వివరించాడని సదరు ఆర్మీ అధికారి మీడియాకు వివరించాడు. అజహర్ తో నిజాలు కక్కించేందుకు ఎంతో కష్టపడాలేమో అని భావించామని, కానీ అతడెంతో సులభంగా చెప్పేశాడని ఆ అధికారి వెల్లడించారు.

ఇదే విషయం గురించి సిక్కిం రాష్ట్ర డీఐజీ అవినాశ్ మోహననే కూడా వ్యాఖ్యానించారు. ఆయన కూడా గతంలో పలుమార్లు మసూద్ అజహర్ ను ఇంటరాగేట్ చేశారు. “మసూద్ అజహర్ పైకి కనిపించేంత గట్టివాడు కాదు… అతడ్ని బెదిరించడం చాలా సులభం. ఒక్క చెంపదెబ్బకే బెంబేలెత్తిపోయాడు. ఆ అధికారి కొట్టిన దెబ్బకు నిలువెల్లా కంపించిపోయాడు. దాంతో అతడిపై మేం ప్రయోగించాలి అని భావించిన పద్ధతులన్నీ పక్కనబెట్టేశాం. ఇంటరాగేషన్ జరిగినంత సేపు మేం అడగాల్సినవన్నీ అతడే చెప్పేశాడు” అని వివరించారు.

‘ఆర్ఆర్ఆర్’.. ‘బాహుబలి’కి ఏమాత్రం తీసిపోదు: రాజమౌళి

‘ఆర్ఆర్ఆర్’.. ‘బాహుబలి’కి ఏమాత్రం తీసిపోదు: రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రూ.300 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా రాజమౌళి.. ఈ చిత్రం ‘బాహుబలి’కి ఏమాత్రం తీసిపోదని.. ఇదొక పాన్ ఇండియా (దేశంలోని అన్ని ప్రాంతాలకూ సరిపోయేది) చిత్రమని వెల్లడించారు.

రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. రామ్ చరణ్‌పై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇదొక పిరియాడికల్ మూవీ అని ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఇటీవల లీక్ అయిన కొన్ని షూటింగ్ తాలూకు ఫోటోలు కూడా ఈ విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి.