గెలవలేని వారు పార్టీలు మారడం సహజమే: గల్లా జయదేవ్

గెలవలేని వారు పార్టీలు మారడం సహజమే: గల్లా జయదేవ్

ఎంపీ రవీందర్ తనతో మంచి స్నేహితుడిలా ఉండేవారని, గంటల వ్యవధిలోనే పార్టీ మారిపోయి తనపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మంగళవారం సాయంత్రం తల్లి అరుణకుమారితో కలిసి ఉండవల్లిలో చంద్రబాబును కలిసి జయదేవ్.. ఈ సందర్భంగా కొన్ని ఆలోచనలను ఆయనతో పంచుకున్నారు. అవి విన్న సీఎం భేష్ అంటూ ప్రశంసించారు. అలాగే, ఎన్నికల షెడ్యూలు వచ్చే వరకు రోజుకు రెండు గంటల సమయాన్ని పార్టీ ప్రణాళికల రూప కల్పనకు కేటాయించాలని గల్లాను కోరారు.

అనంతరం విలేకరులతో మాట్లాడిన గల్లా.. గెలవలేని వారు పార్టీలు మారడం చాలా సహజమన్నారు. ఎంపీ రవీందర్ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కాలేదన్నారు. పార్లమెంటు అనేది ఓ కాలేజీ లాంటిదని, ఏదైనా విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేశాకే మాట్లాడతానని చెప్పారు. తాను నిత్యం నేర్చుకుంటూనే ఉంటానని, అందులో తప్పేంటని గల్లా జయదేవ్ ప్రశ్నించారు.

ఏపీ టీడీపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు

ఏపీ టీడీపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు

ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ ఇప్పటికే దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏర్పాటు చేశారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో 15 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ గా కాలవ శ్రీనివాసులు, సభ్యులుగా అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస్, ఆనంద్ బాబు, ఫరూక్, కిడారి శ్రవణ్, మాణిక్యవరప్రసాద్, నిమ్మల రామానాయుడు, వాసుపల్లి గణేశ్, భూమా బ్రహ్మానందరెడ్డి, కుటుంబరావు, పంచుమర్తి అనూరాధ, శోభా స్వాతిరాణి, పి.కృష్ణయ్యలను నియమించారు. ఈ కమిటీ త్వరలోనే భేటీ కానుంది. కాగా, ఈ మేనిఫెస్టోలో సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్టు సమాచారం. రైతులు, మహిళలు, యువతకు పెద్ద పీట వేసే దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

నా కన్నా ముందే వైసీపీలో చేరాలని గంటా ప్రయత్నించారు: అవంతి శ్రీనివాస్

నా కన్నా ముందే వైసీపీలో చేరాలని గంటా ప్రయత్నించారు: అవంతి శ్రీనివాస్

ఏపీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస్ పై ఇటీవలే వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కన్నా ముందే వైసీపీలో చేరాలని గంటా ప్రయత్నించారని, తాను వైసీపీలో చేరడంతో ఆయన వెనక్కి తగ్గారని ఆరోపించారు. వైసీపీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు కానీ, తమ పార్టీలో ఖాళీలు ఉండాలిగా అని వ్యాఖ్యానించారు.

టీడీపీని వీడిన అవంతిపై ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకులతోనే విమర్శలు చేయించడంపై ప్రశ్నించగా, ‘అదే కదా దురదృష్టం. చంద్రబాబునాయుడు గారికి అదొక ఆనందం. వికృతమైన ఆనందం. ఈ రాష్ట్రంలో ఎవరూ కూడా ఆయన్ని ప్రశ్నించకూడదు. దళితులు ప్రశ్నిస్తే దళితులతో, కాపులు ప్రశ్నిస్తే కాపులతోనే ఆయన తిట్టిస్తారు. ప్రజలకు వాస్తవం ఏంటో తెలుసు. ఆంధ్రా ప్రజలు చాలా తెలివైన వాళ్లు. సమయం వచ్చినప్పుడు తీర్పును చాలా కరెక్టుగా ఇస్తారు’ అని నిప్పులు చెరిగారు.

నెక్ట్స్ వైసీపీలోకి ఫిరాయించేది ఓ కీలక మంత్రి... టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం!

నెక్ట్స్ వైసీపీలోకి ఫిరాయించేది ఓ కీలక మంత్రి… టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం!

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా ఉన్న వారు ఇప్పుడు జగన్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే మేడా మల్లికార్జున్ రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు వైసీపీ తీర్థం పుచ్చుకోగా, ఇప్పుడు ఏపీలో మరో నేత, మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తుండటం టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఆ నేత, ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో పోటీ చేయవద్దని చంద్రబాబు ఆదేశిస్తే, తాను వెనక్కు తగ్గుతానని వ్యాఖ్యానించడం కొత్త చర్చకు దారితీసింది. ఆయనకు ఈ దఫా టికెట్ ను ఆఫర్ చేయలేదని, అందువల్లే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ప్రస్తుతం కీలక మంత్రి పదవిలో ఉన్న ఆయన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే, టీడీపీకి నష్టం అధికమేనని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఆరుగురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్ లో ఆరుగురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో ఆరుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు నేడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం ఎస్పీ కోయ ప్రవీణ్, ఐజీ వినీత్ బ్రిజ్ లాల్, విజయవాడ సిటీ జాయింట్ కమిషనర్‌ నవదీప్ సింగ్, కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, విశాఖ గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌ సత్య ఏసుబాబు, గ్రేహౌండ్స్‌ గ్రూప్ కమాండర్‌ అభిషేక్ మహంతిలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గన్నవరం విమానాశ్రయం: నూతన రన్‌వే నేడు ప్రారంభం

గన్నవరం విమానాశ్రయం: నూతన రన్‌వే నేడు ప్రారంభం

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న గన్నవరం (విజయవాడ) ఎయిర్‌ పోర్టులో చిన్న విమానాలే కాదు ఇకపై ఎయిర్‌బస్‌లు కూడా ల్యాండ్‌ కావచ్చు. విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన రన్‌వే అందుబాటులోకి వస్తుండడమే ఇందుకు కారణం. రాష్ట్ర విభజన అనంతరం కొత్తరాజధానిగా అమరావతిని నిర్ణయించి అక్కడి నుంచే రాష్ట్ర ప్రభుత్వం కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు తాత్కాలిక భవన సముదాయాల్లో అసెంబ్లీ నుంచి పలు విభాగాల కార్యకలాపాలు నిర్వహిస్తూనే శాశ్వత భవనాల నిర్మాణం మరోవైపు కొనసాగుతోంది. దీంతో నిత్యం వేలాది మంది అమరావతికి రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల రాకపోకలు జరుగుతున్నాయి. ఇక్కడ అందుబాటులో ఉన్నది గన్నవరం విమానాశ్రయమే.

ఈ విమానాశ్రయంలో చిన్న విమానాలు తప్ప పెద్ద విమానాలు దిగే సదుపాయం ఇప్పటి వరకు లేదు. దీంతో విమానాశ్రయంలో 3,523 అడుగు వైశాల్యంతో నూతన రన్‌వేను నిర్మించారు. ఈ రన్‌వేను ఈరోజు కేంద్ర మంత్రి సురేష్‌ప్రభు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ రన్‌వే అందుబాటులోకి వస్తే ఎయిర్‌ బస్‌ విమానాలు కూడా సులువుగా గన్నవరానికి రాకపోకలు జరిపే అవకాశం ఉంటుంది.

చంద్రబాబుది దొంగ దీక్ష

చంద్రబాబుది దొంగ దీక్ష

సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టింది ధర్మపోరాట దీక్ష కాదని అది దొంగ పోరాట దీక్ష అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే ముఖ్యమన్న చంద్రబాబు మాటలు అందరికీ గుర్తున్నాయన్నారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ కలిసి ఏపీని భ్రష్టు పట్టించాయన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఉమ్మారెడ్డి సూచించారు.

17న ఏలూరులో వైఎస్సార్‌ సీపీ ‘బీసీ గర్జన’
రాష్ట్రంలోని బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 17న ఏలూరులో బీసీ గర్జన మహాసభను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఏలూరు సభలోనే బీసీ అధ్యయన కమిటీ సమర్పించిన నివేదికను వైఎస్‌ జగన్‌ ప్రకటిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు దృష్టిలో బీసీలు ఓటు బ్యాంకు మాత్రమేనని విమర్శించారు. అధికారం కోసం రకరకాల హామీలివ్వడం, అనంతరం వదిలేయడం ఆయనకే చెల్లుతుందన్నారు. రోజుకో నాటకంతో బీసీలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి బీసీలే తగిన బుద్ధి చెప్పాలని బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు.

narendra modi vs chandra babu naidu, modi guntur pulic meeting

నరేంద్ర మోదీ ఎటాక్ పై చంద్రబాబు కౌంటర్ ఎటాక్ ఇలా!

నిన్న గుంటూరు సమీపంలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. వాటిపై స్పందించిన చంద్రబాబు కౌంటర్ ఎటాక్ కూడా చేశారు. నరేంద్ర మోదీ చేసిన ఏ విమర్శపై చంద్రబాబు ఎలా స్పందించారంటే…

నరేంద్ర మోదీ: నేను వస్తున్నప్పుడు దారి పొడవునా మోడీ గో బ్యాక్ అన్న నినాదాలతో పోస్టులు కనిపించాయి. నేను కచ్చితంగా మళ్లీ వెనక్కు వెళతాను. ప్రధానిగా న్యూఢిల్లీకి వెళతాను.
చంద్రబాబు: గో బ్యాక్ అంటే మోదీకి అర్థం తెలియదనుకుంటా. మిమ్మల్ని ఢిల్లీలో చూడాలని కాదు… తిరిగి గుజరాత్ కు వెళ్లాలని.

నరేంద్ర మోదీ: కాంగ్రెస్ విముక్త రాష్ట్రం కావాలంటూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు అదే కాంగ్రెస్ తో జత కట్టారు. దీన్ని చూసిన ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది.
చంద్రబాబు: నాడు కాంగ్రెస్ దురహంకారంతో వ్యవహరించడంతో ఎదుర్కొనేందుకు పోరాడాం. ఇప్పుడు అదే దురహంకారాన్ని బీజేపీ చూపిస్తోంది. అందుకే నేటి పోరాటం.

నరేంద్ర మోదీ: సన్ (సూర్యుడు) రైజ్ స్టేట్ గా ఏపీని మారుస్తానంటూ మీ సన్ (కుమారుడు)ను రైజ్ చేయించాలని ప్రయత్నిస్తున్నారు.
చంద్రబాబు: మీకు కొడుకుల్లేరు. పెళ్లాన్ని వదిలేశారు. కుటుంబం అక్కర్లేదు. ఆత్మీయతలు, అనుబంధాలు తెలియవు.

నరేంద్ర మోదీ: కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క చెప్పాలంటే వెనకడుగు ఎందుకు. గతంలోనూ ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పలేదు.
చంద్రబాబు: రాజధాని అమరావతి నిర్మాణానికి మట్టి, నీళ్లు ఇచ్చారు. ఏమిచ్చారని మీకు లెక్కలు చెప్పాలి?

నరేంద్ర మోదీ: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని, పార్టీని సొంతం చేసుకున్నారు. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు సీనియర్.
చంద్రబాబు: వెన్నుపోటులో సీనియర్ మీరే. అద్వానీకే వెన్నుపోటు పొడిచారు. గోద్రా అల్లర్ల సమయంలో మిమ్మల్ని సీఎం పదవి నుంచి తొలగించాలని అందరూ అంటుంటే, అద్వానీయే అడ్డుకున్న విషయాన్ని మరిచారు. అటువంటి వ్యక్తికి కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు.

నరేంద్ర మోదీ: పార్టీలు మార్చడంలో చంద్రబాబు దిట్ట. ఓడిపోవడంలోనూ ఆయన ప్రముఖుడే. తనకన్నా సీనియర్ అని చెప్పుకుంటారు. అంతకుమించి చెప్పడానికి ఇంకేమీ లేదు.
చంద్రబాబు: నేనెన్నడూ పార్టీలు మారలేదు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోనే కొనసాగుతున్నా. ఎన్నడూ అవకాశవాద రాజకీయాలు చేయలేదు.
Tags: narendra modi vs chandra babu naidu, modi guntur pulic meeting

praja shanthi, KA paul, chandra babu naidu, ys jagan

ఈ ధర్నాలు, దీక్షలు అంతా బూటకమే: కేఏ పాల్

ఏపీపై కేంద్రం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టనున్న దీక్షపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, జగన్ చేపట్టే ధర్నాలు, దీక్షలు అన్నీ బూటకమేనని పేర్కొన్నారు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేందుకు చంద్రబాబు, జగన్‌లు సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రస్తుతం దేశం ప్రమాదకరమైన స్థితిలో ఉందని, మోదీ పాలనలో అంబానీ, అదానీలే తప్ప పేదలు బాగుపడలేదన్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్తున్నందుకే మోదీ ఫెయిలయ్యారని పేర్కొన్న పాల్.. తన హత్యకు కుట్ర జరుగుతోందని పోలీసులను ఆశ్రయించినా తనకు భద్రత కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Tags: praja shanthi, KA paul, chandra babu naidu, ys jagan

జోరు పెంచిన జగన్.. నేటి నుంచి తిరుపతిలో ‘సమర శంఖారావం’!

జోరు పెంచిన జగన్.. నేటి నుంచి తిరుపతిలో ‘సమర శంఖారావం’!

ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల్లోకి విస్తృతంగా దూసుకెళ్లిన వైసీపీ అధినేత జగన్.. తాజాగా పార్టీని పటిష్టం చేసే దిశగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా నేటి నుంచి ‘సమర శంఖారావం’ పేరుతో వైసీపీ బూత్ స్థాయి కార్యకర్తలు, నేతలతో జగన్ సమావేశం కానున్నారు. ఈరోజు తిరుపతిలో వైసీపీ బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో జగన్ తొలుత సమావేశమవుతారు. అనంతరం స్థానిక ఓట్లను ప్రభావితం చేయగల తటస్థులతో భేటీ అవుతారు.

రేపు వైఎస్సార్ కడప జిల్లాలో జగన్ పర్యటన కొనసాగనుంది. అలాగే ఈ నెల 11న అనంతపురం, 13న ప్రకాశం జిల్లాల్లో జగన్ పర్యటిస్తారు. అయితే నెల్లూరులో ఈ నెల 12న జరగాల్సిన సమర శంఖారావం సభ వాయిదా పడింది. ఈరోజు తిరుపతి పర్యటనలో భాగంగా జగన్ తొలుత ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

అక్కడి నుంచి నేరుగా తిరుపతిలోని తనపల్లి క్రాస్‌ వద్ద గల పీఎల్‌ఆర్‌ గార్డెన్స్‌లో తటస్థ ప్రముఖులతో భేటీ అవుతారు. అనంతరం రేణిగుంట సమీపంలోని యోగానంద ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు మధ్యాహ్నం 1 గంటకు చేరుకుని పార్టీ బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో భేటీ అవుతారు. వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తలశిల రఘురామ్, బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు.