మితిమీరిన ఆత్మవిశ్వాసం వద్దు: చంద్రబాబు

నంద్యాల, కాకినాడ గెలుపులు చూసి మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శించవద్దని తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునేతలకు సూచించారు. నాయకుడికి ప్రతి ఎన్నిక ఒక పాఠం లాంటిదన్నారు. ఫలితాలపై తప్పొప్పులు సమీక్షించుకోవాలని సూచించారు. 2018 డిసెంబర్‌ నాటికి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలుచుకునేలా ప్రణాళికలను రూపొందించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్‌లో పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు రెండు చోట్లా పార్టీ గెలుపుకోసం పనిచేసిన నేతలందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల వల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని చెప్పారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయాలన్న ప్రతిపక్షం కుట్రలను ప్రజలు భగ్నం చేసి, అభివృద్ధికి ఓటేశారని చెప్పారు.
నంద్యాల ఉప ఎన్నికలో తెదేపాకు 56 శాతం పోలింగ్‌ నమోదైందని, వచ్చే ఎన్నికల్లో దాన్ని 60 శాతానికి పెంచుకోవాలని సూచించారు.రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలన్నారు. ఈ సందర్భంగా పబ్లిక్‌ మేనేజ్‌మెంట్‌, పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌, పోల్‌ మేనేజ్‌మెంట్‌లపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ గంటన్నరపాటు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ శిబిరంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు, పెద్ది రామారావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. విజయవాడ ఏ కన్వెన్‌ సెంటర్‌లో మంగళవారం ఇవాల్టి కార్యక్రమానికి కొనసాగింపుగా శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు.

విజయవాడలో ఉద్రిక్తతక

వైసీపీ నేత గౌతం రెడ్డి వ్యాఖ్యలు విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాయి. వంగవీటి రంగా హత్యను ఆయన సమర్థిస్తూ ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయవాడ భగ్గుమనడానికి కారణమయ్యాయి. చివరికి రాధా, ఆయన తల్లి రత్నకుమారి అరెస్ట్‌కు దారి తీశాయి. ఇంతకీ గౌతం రెడ్డి ఏమన్నారంటే..

వంగవీటి రంగా, రాధలను చంపడం దారుణమని ఎందుకంటారని, రౌడీ రాజకీయాలే పరమావధిగా ముందుకెళ్లే వారు పోస్టుమార్టానికి వెళ్లాల్సిందేనని గౌతంరెడ్డి అన్నారు. ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఓ కథ కూడా చెప్పారు. ఓసారి ఓ పాము కనిపించిన వారినందరినీ కాటువేసుకుంటూ వెళ్తూ చివరికి ఓ దేవుడి ఫొటో వెనక దాక్కుందని, కానీ తమను కాటువేసిన పాము దేవుడి ఫొటో వెనక దాక్కుంది కదా.. అని జనాలు చంపడం మానేస్తారా? అని ప్రశ్నించారు.

నిరాహార దీక్షలో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా రౌడీ రాజకీయాలు చేసే వారి భవిష్యత్ పోస్టుమార్టమేనంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. రౌడీ రాజకీయాలు వదిలి తమలాగా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. వాళ్లు వచ్చిన తర్వాతే కుల రాజకీయాలు బయటకు వచ్చాయని ఆరోపించారు. వారు ఈ కులం వారిని చంపితే, వారు ఈ కులం వారిని చంపడం మొదలుపెట్టారని గౌతం రెడ్డి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

కాకినాడలో ఊహించిన ఫలితమే.!

ఉప ఎన్నికలైనా, స్థానిక ఎన్నికలైనా అధికార పార్టీకి వుండే ‘ఎడ్జ్‌’ ప్రత్యేకం. మొన్న నంద్యాల ఉప ఎన్నిక ఫలితమైనా, నేడు కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నిక ఫలితమైనా.. అధికార పార్టీకి వ్యతిరేకంగా వస్తే, అదో సెన్సేషన్‌. ప్రతిపక్షం వెనుకబడటం అనేది సాధారణమైన వార్తే. ఎట్‌ ది సేమ్‌ టైమ్‌ అధికార పార్టీ విజయం సాధించడమూ సాధారణమైన వార్తగానే భావించాలేమో.!

కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి మెజార్టీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేస్తోంది. ప్రతిపక్షం వైఎస్సార్సీపీ పెద్దగా అధికార పార్టీకి పోటీ ఇచ్చినట్లు కన్పించడంలేదు. అయితే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోదరుడి తనయుడ్ని ఓడించడంలో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం సాధించడం గమనార్హమిక్కడ.

సదరు ఎమ్మెల్యే మొత్తంగా తన బలాన్నంతా 22వ డివిజన్‌ మీద ఫోకస్‌ పెట్టినా ప్రయోజనం లేకుండాపోయింది. టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు సోదరుడి కుమారుడు శివకుమార్‌పై, వైఎస్సార్సీపీ అభ్యర్థి కిషోర్‌ ఘనవిజయాన్ని అందుకున్నారు. మరో డివిజన్‌నీ కైవసం చేసుకుంది వైఎస్సార్సీపీ. టీడీపీ 13కి పైగా డివిజన్లలో విజయం సాధించింది. ఇది ఉదయం 10 గంటల నాటి పరిస్థితి. మరో 2 గంటల్లోనే పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి.

మొత్తంగా ఫలితాలు ఇందుకు భిన్నంగా వుండే అవకాశాలైతే లేవు. మెజార్టీ స్థానాలు టీడీపీ – బీజేపీ కూటమి కైవసం చేసుకోనుండడంతో కాకినాడ మేయర్‌ పదవి తెలుగుదేశం పార్టీ వశం కావడం లాంఛనమే కావొచ్చు.

రేపు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ..

8మంది ఔట్.. ఏపీ నుంచి హరిబాబుకు చోటు?
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సర్వం సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే శనివారమే కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇందులో భాగంగా ఎన్డీయేలోకి ఇటీవల వచ్చి చేరిన జేడీయూకు కేబినెట్‌లో స్థానం కల్పించనుండగా, అన్నాడీఎంకే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇక ప్రస్తుత మంత్రుల్లో 8 మందిపై కత్తివేలాడుతుండగా, మరో 8 మంది శాఖలు మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు రాజీవ్ ప్రతాప్ రూడీ, సంజీవ్ బల్యాన్, ఉమాభారతి, ఫగన్ సింగ్ కులస్తే, గిరిరాజ్ సింగ్ రాజీనామా చేయగా వీరిలో రాజీవ్ రూడీ, సంజీవ్ బల్యాన్ రాజీనామాలను ఆమోదించారు. ఉమాభారతి అనారోగ్య కారణాలతో రాజీనామా సమర్పించారు.

ఇక పదవి కోల్పోనున్న వారిలో నిర్మలా సీతారామన్, కల్రాజ్ మిశ్రా ఉన్నట్టు తెలుస్తోంది. నితిన్ గడ్కరీకి రైల్వే శాఖ అప్పగించనున్నట్టు తెలుస్తుండగా, సీతారామన్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పౌర విమానయాన శాఖామంత్రి అశోక్ గజపతిరాజు శాఖ మారిపోనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆర్థిక, రక్షణ శాఖల బాధ్యతలు మోస్తున్న అరుణ్ జైట్లీకి రక్షణ శాఖను పూర్తిస్థాయిలో అప్పగించి ఆర్థిక శాఖను పీయూష్‌కు అప్పగించే యోచనలో ఉన్నారు. ఏపీ బీజేపీ నేత కంభంపాటి హరిబాబుకు కేబినెట్‌లో చోటు ఖాయంగా కనిపిస్తోంది.

2019 కల్లా స్విస్ నల్లకుబేరుల జాబితా ఇస్తాం: స్విస్ అధ్యక్షురాలి హామీ

 

నల్లకుబేరుల వివరాల తొలి జాబితాను 2019 కల్లా అందజేస్తామని స్విట్జర్లాండ్‌ అధ్యక్షురాలు డోరిస్‌ ల్యూథర్డ్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆమె ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిపిన విస్తృత చర్చల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలతో పాటు ద్వైపాక్షిక సంబంధాలు, పన్ను ఎగవేత, నల్లధనాన్ని వెలికితీసేందుకు సహకారంపై అవగాహనకు వచ్చారు. ఈ సందర్భంగా అణు ఇంధన సరఫరా దేశాల గ్రూప్‌ (ఎన్‌ఎస్‌జీ) లో, క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్‌) లో సభ్యత్వానికి మద్దతు తెలపడంపై ఆమెకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. పన్ను ఎగవేత సమాచార ఆటోమేటిక్ మార్పిడి చట్టాన్ని ఈ ఏడాది చివరికంతా పార్లమెంటు ఆమోదిస్తుందని ఆమెకు హామీ ఇచ్చారు. రైల్వే రంగంలో సహకారానికి రెండు ఒప్పందాలు కుదుర్చుకున్నామని మీడియా సమావేశంలో తెలిపారు.

నా మనవడు నా పేరే మర్చిపోయాడు: నటుడు బాలకృష్ణ

తన మనవడు చిన్నారి దేవాన్ష్ తన పేరే మర్చిపోయాడని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘మనవడు దేవాన్ష్ ను ‘నా పేరేంటిరా? అని అడిగితే..‘శాతకర్ణి’ అని, లేకపోతే ‘గోల తాత’ అంటాడు’ అని చెబుతూ బాలయ్య నవ్వులు చిందించారు.

బాలయ్య తన అభిమానిపై చేయిచేసుకున్న సందర్భాన్ని ప్రస్తావించగా, ‘నా చేయి తగలడం అభిమానులు ప్రేమగా భావిస్తారు. అతిగా చేస్తే తప్పా, నేను చేయి చేసుకోను. నా అభిమానులకు నాకు మధ్య ఎవరైనా వస్తే దబిడిదిబిడే’ అని చెప్పుకొచ్చారు. కాగా, దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘పైసా వసూల్’ చిత్రం రేపు విడుదల కానుంది.

 

ప్రతిపక్ష వైసీపీ నుంచి మళ్లీ జంపింగ్‌లు..

టీడీపీలోకి పలువురు ఎమ్మెల్యేలు?

నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి ప్రభావం వైసీపీ నేతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తమ భవిష్యత్తుపై ఆందోళన రేకిత్తిస్తోంది. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండడంతో ఇప్పుడే మేలుకుంటే మంచిదనే భావన వారిలో కనిపిస్తోంది. అందులో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా తమ అధినేత నంద్యాలలో ఏకంగా 13 రోజులు మకాం వేసి ప్రచారం చేసినా ఓటర్లు విశ్వసించకపోవడాన్ని చూసి వారిలో దిగులు మొదలైంది. కళ్ల ముందు భవిష్యత్తు కనిపిస్తుండడంతో టీడీపీ తప్ప మరోమార్గం లేదని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

బుధవారం సచివాలయంలో ఇధ్దరు మంత్రులకు రాయలసీమకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు రావడం ఇందుకు నిదర్శనంగా భావిస్తున్నారు. వారిద్దరూ టీడీపీలో చేరికపై ఆసక్తి కనబరిచనట్టు మంత్రులు చూచాయగా చెప్పారు. అయితే అంతకుముందు చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంటుందని చెప్పడం చూస్తుంటే రాక ఖాయమనన్న విషయం స్పష్టమవుతోంది. అయితే వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకునే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోమని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ ప్రచారం చేసినంతగా ప్రజల్లో టీడీపీపైనా, ప్రభుత్వంపైనా వ్యతిరేకత లేదన్న విషయం స్పష్టమైందని స్వయంగా వైసీపీ నేతలే చెబుతుండడం ఇందుకు మరో ఉదాహరణగా చెబుతున్నారు. మరోవైపు నంద్యాలలో గెలిచి ఉంటే బీజేపీ తమతో జత కడుతుందని వైసీపీ చీఫ్ భావించారని, ఇప్పుడా పరిస్థితి లేదని చెబుతున్నారు. కాగా, పార్టీ మారే అవకాశం ఉందని భావిస్తున్న ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్టానం ఓ కన్నేసి ఉంచినట్టు సమాచారం.

 

99 శాతం 1000 నోట్లు వచ్చేశాయి: ఆర్బీఐ ప్రకటన

గత నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మూడు నెలలపాటు పాత నోట్లను తిరిగి ఆర్బీఐకి ఇచ్చేసేందుకు గడువును విధించింది. దీంతో పాత నోట్లు వెల్లువలా బ్యాంకులను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లకు ఆర్బీఐ రద్దు చేసిన పాత నోట్లపై తొలిసారి వార్షిక నివేదికలో పేర్కొంది. అందులో రద్దయిన కరెన్సీ మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేసినట్టేనని తెలిపింది. ప్రధానంగా రద్దయిన 1,000 రూపాయల నోట్లలో సుమారు 99 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చాయని చెప్పింది. 15.44 లక్షల కోట్ల విలువైన 1,000, 500 రూపాయల నోట్లు రద్దు కాగా, 15.28 లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చాయని పేర్కొన్నారు. ఇంకా రావాల్సినవి 8,900 కోట్ల రూపాయల విలువైన 1000 నోట్లు మాత్రమే ఇంకా బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాల్సిఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

2008 నుంచి ఇప్పటి వరకు 72 మంది ఇండియన్ మిలియనీర్లు బ్రిటన్ చెక్కేశారు.. వెల్లడించిన యూకే

గత తొమ్మిది సంవత్సరాల్లో భారత్ నుంచి 72 మంది మిలియనీర్లు, 84 మంది డిపెండెంట్లు యూకేకు వలస వచ్చినట్టు బ్రిటన్ హోమ్ వ్యవహారాల కార్యాలయ గణాంకాలు చెబుతున్నాయి. విదేశీ పెట్టుబడిదారుల కోసం మంజూరు చేసే టైర్-1 (ఇన్వెస్టర్) వీసా ద్వారా 2 మిలియన్లు, అంతకంటే ఎక్కువ పౌండ్లు పెట్టుబడిగా పెడతామని హామీ ఇస్తూ వీరంతా బ్రిటన్ చేరుకున్నారు. కాగా, 2013లో 16 మంది భారత మిలియనీర్లు బ్రిటన్‌కు వెళ్లిపోగా ఇప్పుడు ఏకంగా 72 మంది బ్రిటన్ చెక్కేశారు. భారతీయుల తర్వాత చైనా, రష్యా, అమెరికాకు చెందిన మిలియనీర్లు టైర్-1 వీసాను ఎక్కువగా తీసుకున్నారు. వీసా పొందిన వారి జాతీయ తప్ప ఇతర వివరాలు వెల్లడించేందుకు బ్రిటన్ నిరాకరించింది.

సినీ కుటుంబాల్లో మనశ్శాంతి ఉండదు…

 

సినీ పరిశ్రమకు చెందిన కుటుంబాల్లో మనశ్శాంఅందుకే డ్రగ్స్ తీసుకుంటారు: వర్ధమాన నటుడుతి ఉండదని అందుకే డ్రగ్స్ వంటి వాటిని ఆశ్రయిస్తారని నటుడు అభినయ్ దర్శన్ తెలిపాడు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో జరిగిన బెత్లెహామ్ ప్రార్థనా మందిరంలో జరిగిన ఉజ్జీవ సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అలా మనశ్వాంతి లేకపోవడంతో హిమాలయాలు వంటి ప్రాంతాలకు దానిని వెతుక్కుని వెళ్తుంటారని అన్నాడు. తాను సినీ హీరోగా ఉన్నప్పుడు మిస్స్డ్ కాల్స్, పోకిరి పోలీస్, బీటెక్ లవ్ వంటి సినిమాల్లో హీరోగా నటించానని ఆయన చెప్పాడు. ఆ సమయంలో మనశ్శాంతి కోసం డ్రగ్స్, మద్యం తీసుకునేవాడినని తెలిపాడు. అయితే క్రైస్తవం స్వీకరించిన తరువాత అలాంటి అలవాట్లు మానేశానని చెప్పాడు.