Actress Rhiya Chakraborty arrested in Sushant affair

సుశాంత్ వ్యవహారంలో నటి రియా చక్రవర్తి అరెస్ట్

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో డ్రగ్స్ కోణం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్సీబీ అధికారులు నటి రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. సుశాంత్ గాళ్ ఫ్రెండ్ గా గుర్తింపు తెచ్చుకున్న రియాను ఎన్సీబీ అధికారులు గత కొన్నిరోజులుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో తాను సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు రియా అంగీకరించింది. ఆమె నుంచి ఇప్పటికే కీలక సమాచారం రాబట్టిన ఎన్సీబీ… మరింత సమాచారం తెలుసుకునేందుకు ఆమెను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

దర్యాప్తులో ఎన్సీబీ వేగం పెంచడం చూస్తుంటే సుశాంత్ మరణంలో డ్రగ్స్ వ్యవహారమే కేంద్రబిందువుగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి.

కాగా, రియా చక్రవర్తి ప్రస్తుతం ముంబయిలోని ఎన్సీబీ కార్యాలయంలో ఉంది. ఆమెను ఇవాళ రెండు దఫాలుగా విచారించిన ఎన్సీబీ అధికారులు మరోసారి విచారించేందుకు సిద్ధమవుతున్నారు. రియాను ఇవాళ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపించడంలేదు. రియాకు తొలుత వైద్య పరీక్షలు నిర్వహించాలని నార్కొటిక్స్ అధికారులు భావిస్తున్నారు.
Tags: Rhea Chakraborty, NCB, Arrest, Sushant Singh Rajput Death, Drugs, Bollywood

30 వేలు దాటిన కరోనా మృతులు

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా భారత్ లో కరోనా విజృంభిస్తోంది. దేశంలో లాక్ డౌన్ కు సడలింపులు ఇచ్చిన తర్వాత కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. నేటికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 12,38,636 కి చేరింది.

వైరస్ బారిన పడి ఇప్పటివరకు కరోనాతో 30,601 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం భారత్ లో యాక్టీవ్ కేసుల సంఖ్య 4,26,167 కి చేరింది. కరోనా నుంచి కోలుకొని ఇప్పటి వరకు 7,82,606 మంది ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయినారు.

Flight Crash, Pakistan, Karachi

కరాచీ విమాన ప్రమాదం.. మేడే, మేడే.. పైలట్ చివరి మాటలు ఇవే!

పాకిస్థాన్‌లో నిన్న జరిగిన విమాన ప్రమాదానికి ముందు తాము ఆపదలో ఉన్నామంటూ పైలట్ పంపిన హెచ్చరికలకు సంబంధించిన కాక్‌పిట్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. విమానం క్రాష్ కావడానికి ముందు పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) మధ్య జరిగిన సంభాషణ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘లైవ్ఏటీసీ.నెట్’లో ప్రత్యక్షమైంది. ఆ సంభాషణ ప్రకారం.. తాము ప్రమాదంలో ఉన్నామని చెప్పేందుకు ‘మేడే, మేడే, మేడే’ అనే సందేశాన్ని పైలట్ ఏటీసీకి పంపాడు. ఆ వెంటనే రాడార్‌తో సంబంధాలు తెగిపోయి విమానం కూలిపోయింది.

తొలుత పైలట్ విమానం అప్రోచ్ అవుతున్నట్టు ఏటీసీకి తెలిపాడు. అందుకు ఏటీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో మేం ఎడమవైపునకు తిరగాలా? అని పైలట్ మళ్లీ ప్రశ్నించాడు. దీనికి ఏటీసీ నుంచి ‘అవును’ అని గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే, విమానం రెండు ఇంజిన్లు దెబ్బతిన్నాయని, తాము నేరుగా వెళ్తున్నామని పైలట్ మళ్లీ చెప్పాడు. దీంతో స్పందించిన ఏటీసీ బెల్లీ ల్యాండింగ్‌కు కనుక సిద్ధపడితే కన్ఫామ్ చేయాలని కోరింది.

అంతేకాదు, ల్యాండింగ్‌కు 2, 5 రన్‌వేలు సిద్ధంగా ఉన్నాయని చెప్పింది. అర్థం కావడం లేదని చెప్పిన పైలట్.. ‘మేడే, మేడే, మేడే’ అంటూ తాము ప్రమాదంలో ఉన్నామన్న సంకేతాన్ని పంపాడు. అనంతరం సంభాషణ తెగిపోయింది.

ఆ తర్వాత కొన్ని క్షణాలకే విమానం ఓ మొబైల్ టవర్‌ను ఢీకొట్టి జనావాసాల్లో కుప్పకూలింది. రెండు రన్‌వేలు సిద్ధంగా ఉన్నాయని చెప్పినా పైలట్ గో-రౌండ్ (గాల్లో చక్కర్లు కొట్టేందుకే) మొగ్గు చూపాడని ఏటీసీ అధికార ప్రతినిధి అబ్దుల్లా హెచ్.ఖాన్ తెలిపారు.
Tags: Flight Crash, Pakistan, Karachi

KGF, Thieves, Iron, Death, Oxygen

కర్ణాటక కేజీఎఫ్ గనుల్లో చోరీకి యత్నం… ఊపిరాడక ముగ్గురు దొంగల మృతి!

లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ కూడా ఐదుగురు దొంగలు చోరీకి యత్నించడం, వారిలో ముగ్గురు మరణించడం కలకలం రేపింది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్) గనుల్లో ఈ ఘటన జరిగింది. కుప్పం సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉన్న కేజీఎఫ్ గనుల్లో ఇనుప సామగ్రి దొంగతనం చేసేందుకు ఐదుగురు వ్యక్తులు వెళ్లారు.

వారు గనుల్లో 100 అడుగుల లోతుకు వెళ్లగా, అక్కడ ఆక్సిజన్ లభ్యత తగ్గిపోవడంతో వారు ఊపిరందక ఉక్కిరిబిక్కిరయ్యారు. వారిలో ముగ్గురు అక్కడే ప్రాణాలు వదలగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. దొంగలు పెద్దగా కేకలు వేయడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఇద్దరిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.

కాగా, లాక్ డౌన్ అమల్లో ఉండడంతో గత కొన్నివారాలుగా కోలార్ ప్రాంతంలో బంగారం వెలికితీత పనులు నిలిచిపోగా, కేజీఎఫ్ గనులు మూతపడి ఉన్నాయి. ఇదే అదనుగా చోరీ చేద్దామని ప్రయత్నించిన దొంగలు ప్రాణాలకే ముప్పుతెచ్చుకున్నారు.
Tags: KGF, Thieves, Iron, Death, Oxygen

కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కారు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం!

కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కారు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం!

కర్ణాటకలోని తుముకూరు వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి ప్రయాణిస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వస్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఎమ్మెల్యే రవికి స్వల్ప గాయమైంది. కొందరు వ్యక్తులు ఓ కారులో కొల్లూరు ఆలయాన్ని దర్శించుకుని బెంగళూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు చెందిన కారును ఈరోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో కునిగల్ వద్ద సదరు వాహనం ఢీకొట్టింది. దీంతో ఎదురుగా వస్తున్న కారులోని ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ విషయమై కర్ణాటక బీజేపీ విభాగం స్పందిస్తూ.. ప్రమాదం జరిగిన సమయంలో రవి కారును నడపలేదనీ, ఆయనకు మద్యం అలవాటు కూడా లేదని స్పష్టం చేసింది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేవరకూ ఎమ్మెల్యే రవి అక్కడే ఉన్నారని తెలిపింది. రవికి ఈ ప్రమాదంలో ఛాతీ భాగంలో గాయమయిందనీ, ఆయన సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం వెళ్లిపోయారని పేర్కొంది. మరోవైపు రవి కారును విచారణ నిమిత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఒక్క చెంపదెబ్బతో జైషే చీఫ్ మసూద్ అజహర్ అన్నీ కక్కేశాడట!

ఒక్క చెంపదెబ్బతో జైషే చీఫ్ మసూద్ అజహర్ అన్నీ కక్కేశాడట!

మౌలానా మసూద్ అజహర్… కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు. భారత్ అంటే వల్లమాలిన ద్వేషం ప్రదర్శించే మసూద్ అజహర్ భారత్ లో అనేక ఉగ్రదాడులకు కారకుడు. కశ్మీర్ కోసం భారత్ ను అస్థిరతకు గురిచేయడమే అతడి ఏకైక అజెండా. అందుకోసం ఎంత దారుణానికైనా తెగిస్తాడు. అయితే ఇవన్నీ పైకి కనిపించే విషయాలేనని, వాస్తవానికి మసూద్ అజహర్ చాలా పిరికివాడని భారత ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. 1994లో పోర్చుగీస్ పాస్ పోర్టుతో బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించినప్పుడు భారత్ భద్రత బలగాలు అతడిని అరెస్ట్ చేశాయి. ఈ సందర్భంగా కస్టడీలోకి తీసుకున్న అధికారులు అతడ్ని సుదీర్ఘంగా ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు.

అయితే, ఇంటరాగేషన్ మొదలైన కొన్ని నిమిషాలకే అతడ్ని ఓ ఆర్మీ అధికారి గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు కళ్లు బైర్లు కమ్మిన మసూద్ అజహర్ అడిగినవీ, అడగనివీ అన్నీ చెప్పేశాడట. పాకిస్థాన్ భూభాగంపై స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఉగ్రసంస్థలు ఎలా పనిచేస్తాయో అన్నీ కూలంకషంగా వివరించాడని సదరు ఆర్మీ అధికారి మీడియాకు వివరించాడు. అజహర్ తో నిజాలు కక్కించేందుకు ఎంతో కష్టపడాలేమో అని భావించామని, కానీ అతడెంతో సులభంగా చెప్పేశాడని ఆ అధికారి వెల్లడించారు.

ఇదే విషయం గురించి సిక్కిం రాష్ట్ర డీఐజీ అవినాశ్ మోహననే కూడా వ్యాఖ్యానించారు. ఆయన కూడా గతంలో పలుమార్లు మసూద్ అజహర్ ను ఇంటరాగేట్ చేశారు. “మసూద్ అజహర్ పైకి కనిపించేంత గట్టివాడు కాదు… అతడ్ని బెదిరించడం చాలా సులభం. ఒక్క చెంపదెబ్బకే బెంబేలెత్తిపోయాడు. ఆ అధికారి కొట్టిన దెబ్బకు నిలువెల్లా కంపించిపోయాడు. దాంతో అతడిపై మేం ప్రయోగించాలి అని భావించిన పద్ధతులన్నీ పక్కనబెట్టేశాం. ఇంటరాగేషన్ జరిగినంత సేపు మేం అడగాల్సినవన్నీ అతడే చెప్పేశాడు” అని వివరించారు.

ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే..!

ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే..!

ఉగ్రదాడిలో అమరులైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల వివరాలను భారత ప్రభుత్వం విడుదల చేశారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 40 మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. వారిలో 36 మృతదేహాలను గుర్తించి వారి వివరాలను శుక్రవారం విడుదల చేశారు. మరికొంతమంది వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

కాగా మృతిచెందిన వారిలో అత్యధికంగా 12 మంది జవాన్లు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారు కాగా, నలుగురు పంజాబ్‌, రాజస్తాన్‌ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఉగ్రదాడిలో మృతిచెందిన ఇద్దరు తమిళనాడు జవాన్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఇరవై లక్షల చెప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.

అమరులైన జవాన్లు వీరే..
1. రాథోడ్‌ నితిన్‌ శివాజీ, మహారాష్ట్ర
2. వీరేంద్ర సింగ్‌, ఉత్తరాఖండ్‌
3. అవదేశ్‌ కుమార్‌ యాదవ్‌, ఉత్తరప్రదేశ్‌
4. రతన్‌ కుమార్‌ ఠాకూర్‌, బిహార్‌
5. పంకజ్‌ కుమార్‌ త్రిపాఠి, ఉత్తర ప్రదేశ్‌
6. జెట్‌ రామ్‌, రాజస్తాన్‌
7. అమిత్‌ కుమార్‌, ఉత్తరప్రదేశ్‌
8. విజయ్‌ మౌర్యా, ఉత్తరప్రదేశ్‌
9. కుల్విందర్‌ సింగ్‌, పంజాబ్‌
10, మనేశ్వర్‌ బసుమంతరాయ్‌, అస్సాం.
11. మోహన్‌ లాల్‌, ఉత్తరాఖండ్‌
12. సంజయ్‌ కుమార్‌ సిన్హా
13. రామ్‌ వకీల్‌, ఉత్తరప్రదేశ్‌
14. నాసీర్‌ ఆహ్మద్‌, జమ్మూ కశ్మీర్‌
15. జైమాల్‌ సింగ్‌, పంజాబ్‌
16. కుఖేందర్‌ సింగ్‌, పంజాబ్‌
17. తిలక్‌ రాజ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌
18. రోహితేష్‌ లంబా, రాజస్తాన్‌
19. విజయ్‌ సోరింగ్‌, జార్ఖండ్‌
20. వసంత్‌ కుమార్‌, కేరళ
21. సుబ్రహ్మణ్యం , తమిళనాడు
22. గురు, కర్ణాటక
23. మనోజ్‌ కేఆర్‌ బెహరా
24. నారాయణ్‌ లాల్‌గుర్జార్‌, రాజస్తాన్‌
25. ప్రదీప్‌ కుమార్‌, ఉత్తర ప్రదేశ్‌
26. హమ్రాజ్‌ మీనా, రాజస్తాన్‌
27. రమేష్‌ యాదవ్‌, ఉత్తరప్రదేశ్‌
28. సంజయ్‌ రాజ్‌పుత్‌, ఉత్తరప్రదేశ్‌
29. కౌశల్‌ కుమార్‌ రాజ్‌పుత్‌, ఉత్తరప్రదేశ్‌
30. ప్రదీప్‌ సింగ్‌, ఉత్తర ప్రదేశ్‌
31. శ్యామ్‌ బాబు, ఉత్తరప్రదేశ్‌
32. అజిత్‌ కుమార్‌, ఉత్తరప్రదేశ్‌
33. మహేందర్‌ సింగ్‌ అట్టారి, పంజాబ్‌
34. అశ్విన్‌ కుమార్‌, మధ్యప్రదేశ్‌,
35. సుదీప్‌ బిస్వాస్‌, బెంగాల్‌
36. శివచంద్రన్‌, తమిళనాడు

మానసిక వేధింపులు భరించలేని ఓ మహిళ..

మానసిక వేధింపులు భరించలేని ఓ మహిళ..

చిన్నారిని నరికి చంపి రక్తం తాగింది. ఈ దారుణ సంఘటన ఏపీలోని విశాఖ మన్యంలోని పెదబయలు మండలం లకేయుపుట్టులో మంగళవారం చోటుచేసుకున్నది. లక్ష్మీపేట పంచాయతీ కప్పాడు గ్రామానికి చెందిన వంతాల రస్మో అనే మహిళ నెల రోజులుగా భర్తకు దూరంగా ఉంటూ తమ్ముడి ఇంట్లో ఉంటున్నది. అయితే నాలుగు రోజుల నుంచి ఆమె తమ్ముడి భార్య, ఇతర కుటుంబసభ్యులు అత్తగారింటికి వెళ్లిపోవాలని వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కుటుంబసభ్యుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో వంతాల రస్మో తమ్ముడి భార్యపై కక్ష పెంచుకున్నది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తమ్ముడి కుమార్తె కొర్ర అనిత (6)ను కట్టెల కోసమని సమీపంలో ఉన్న కొండపైకి తీసుకెళ్లింది.

అక్కడ కట్టెలు నరికే కత్తితో చిన్నారిపై అత్యంత దారుణంగా దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత చిన్నారి రక్తాన్ని రస్మో తాగేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు కొండపైకి వెళ్లి చూడగా చిన్నారి అప్పటికే మృతి చెందింది. దీంతో గ్రామస్థులు నిందితురాలిని పట్టుకొని చెట్టుకు కట్టేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే చిన్నారి తండ్రి ఏడాది క్రితమే మృతి చెందాడు. కుమార్తె మృతితో తల్లి కన్నీరుమున్నీరయింది.

భార్యను గృహ నిర్బంధం చేసిన భర్త

భార్యను గృహ నిర్బంధం చేసిన భర్త

కడపలో అమానుషం చోటుచేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని గౌసియా అనే మహిళను ఆమె భర్త ఇంట్లో బంధించాడు. గౌసియాకు ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు పిల్లలు పట్టకపోవడంతో భర్త మరో వివాహం కూడా చేసుకున్నాడు. తన మొదటి భార్య గురించి ఎవ్వరికీ తెలియకూడదని బూత్‌ బంగ్లా లాంటి ఇంట్లో ఒంటరిగా బంధించాడు. భర్త బంధించడంతో గతకొద్ది రోజులుగా ఆమె చీకటి జీవితం అనుభవిస్తోంది.

విషయం తెలుసుకున్న గౌసియా కుటుంబ సభ్యులు మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రంగ ప్రవేశం చేసిన అధికారులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని పోలీసులకు అ‍ప్పగించారు. ఘటనపై విచారించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

తెలంగాణలో దారుణం.. మహిళపై అత్యాచారం చేసి హతమార్చిన దుండగులు!

తెలంగాణలో దారుణం.. మహిళపై అత్యాచారం చేసి హతమార్చిన దుండగులు!

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి అపోలో ఆసుపత్రి పక్కనున్న పాల దుకాణం షెడ్ లో కొందరు దుండగులు ఓ గుర్తుతెలియని మహిళను కిరాతకంగా హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

ఈరోజు ఉదయం షెడ్ లో నిర్జీవంగా పడిఉన్న మహిళను గుర్తించిన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. బాధితురాలిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు భావిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.