Telangana, Hyderabad, Corona Virus, Police 

హైదరాబాద్‌లో కరోనా బారిన పడిన సీఐ, ఎస్సై,కానిస్టేబుల్!

తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళనకు గురిచేస్తుండగా మరోవైపు, కరోనా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు కూడా ఒక్కొక్కరుగా కరోనా రోగులుగా మారుతుండడం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సీఐ మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా పరీక్షలు నిర్వహించడంతో కోవిడ్ సోకినట్టు తేలింది. దీంతో వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వలస కార్మికులను సొంత రాష్ట్రానికి పంపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కంటైన్‌మెంట్ జోన్లలోనూ ఆయన విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఎక్కడో ఆయనకు వైరస్ సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు.

సీఐకి కరోనా సోకిందన్న విషయం తెలియగానే అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న నలుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు కలిపి మొత్తం 30 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. వీరిలో కొందరిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. అలాగే, గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించిన ఎస్సై, కానిస్టేబుల్‌కు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కరోనా సోకిన పోలీసుల కుటుంబాలను గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. మరోవైపు, పోలీసులు కరోనా బారినపడుతుండడంతో ఆ శాఖలో కలకలం రేగింది. చాలామంది పోలీసులు లాంగ్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.
Tags: Telangana, Hyderabad, Corona Virus, Police

Etela Rajender CentreLetter Corona Virus Testings

కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలు సరికాదు: మంత్రి ఈటల

తెలంగాణలో కరోనా టెస్టులను తక్కువగా నిర్వహిస్తున్నారంటూ కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. జాతీయ సగటు కంటే టెస్టులు తక్కువగానే ఉన్నాయని వ్యాఖ్యానిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. ఈ లేఖపై తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని ఈటల చెప్పారు. తమ పటిష్ట చర్యల వల్ల కేసులు కూడా తక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్ర పరిస్థితులకు తగ్గట్టు పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.

మరోవైపు, కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలోనే… కేంద్రం నుంచి విమర్శలు రావడం గమనార్హం.
Tags: Etela Rajender CentreLetter Corona Virus Testings

Lockdown Hyderabad, Exemptions, Police Traffic

హైదరాబాద్ లో బారికేడ్లన్నీ తొలగింపు… పూర్తి స్థాయిలో రోడ్డుపైకి వచ్చేసిన వాహనాలు!

దాదాపు 60 రోజుల లాక్ డౌన్ తరువాత హైదరాబాద్ తిరిగి మామూలు స్థాయికి వచ్చినట్టుగా బుధవారం ఉదయం కనిపించింది. రోడ్ల కూడళ్లలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు, చెక్ పోస్టులు తొలగిపోయాయి. ప్రజలు ఏ మాత్రం కరోనాపై భయం లేకుండా, తమతమ వాహనాలతో రోడ్లపైకి వచ్చేశారు. వీధుల్లోని షాపులన్నీ తెరచుకున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మాల్స్ మాత్రం తెరచుకోలేదు. వేల సంఖ్యలో కార్లు, బైక్ లు బయటకు రావడంతో, అన్ని సిగ్నల్స్ వద్దా ట్రాఫిక్ భారీగా కనిపిస్తోంది.

ఇక పోలీసులు అన్ని ట్రాఫిక్ నిబంధనలనూ విధిగా పాటించాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ను ధరించడం తప్పనిసరని, మాస్క్ లేకుంటే రూ. 1000 జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ఏ వాహనంలో ప్రయాణించినా, వాహనానికి సంబంధించిన పత్రాలన్నింటినీ దగ్గర ఉంచుకోవాలని, సాయంత్రం 7 గంటల వరకే సడలింపులు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ తరువాత బయట తిరిగే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
Tags: Lockdown Hyderabad, Exemptions, Police Traffic

Katedan, Leopard, Hyderabad

ఇంకా కనిపించని చిరుత.. భయంభయంగా కాటేదాన్ వాసులు

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై నిన్న ఉదయం కనిపించి, పట్టుకునే క్రమంలో మాయమైన చిరుత ఆచూకీ ఇప్పటికీ లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దానిని బంధించేందుకు నిన్నటి నుంచి అటవీ, జూ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మాయమైన చిరుత కోసం 20 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. నాలుగుసార్లు డ్రోన్ కెమెరాలతో గాలింపు జరిపారు. 2 మేకలను ఎరగా వేశారు. 10 శునకాలను అడవిలోకి పంపారు.. అయినప్పటికీ చిరుత జాడ మాత్రం కనిపించకపోవడంతో సమీప గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

చిరుత ఫామ్ హౌస్ వెనక ఉన్న చెట్టుపై నక్కి ఉంటుందని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు రోడ్డులో పెట్రోలు బంకుల యజమానులు, వివిధ దుకాణదారులు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో గగన్‌పహాడ్ పెట్రోలు బంకు వద్ద వీధికుక్కలు గుంపుగా తరుముతున్న దృశ్యాలను అధికారులు గుర్తించారు. కుక్కలు తరుముతున్నది చిరుతనే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని గాలిస్తున్నారు.
Tags: Katedan, Leopard, Hyderabad

TS, RTC, Buses, Corona Virus, Social Distancing, New Seating

ఏ బస్సులో సీటింగ్ ఎలా ఉంటుంది?… టీఎస్ ఆర్టీసీ ప్రతిపాదనలు ఇవే!

ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి తెలంగాణ రాజధాని నుంచి పరుగులు పెట్టనున్నాయి. కరోనా నేపథ్యంలో దాదాపు 8 వారాల నుంచి తిరగని బస్సులు రోడ్లపైకి రానుండటంతో, తెలంగాణ ఆర్టీసీ సైతం స్పందించింది. కనీసం సంవత్సరం పాటు లేదా కరోనాకు వాక్సిన్ వచ్చేంత వరకూ భౌతికదూరం పాటించడం తప్పనిసరైన పరిస్థితుల్లో, తగు జాగ్రత్తలు తీసుకుని ఆర్టీసీ బస్సులను నడిపించాలని భావిస్తూ, అందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

సూపర్ లగ్జరీ బస్సుల్లో అటూ ఇటూ ఉండే రెండేసి సీట్ల స్థానంలో ఒక్కో సీటు ఉంచి, మధ్య వరుసలో మరో సీటును అమర్చి నమూనా బస్ ను సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ అంగీకరిస్తే, మిగతా అన్ని బస్సులనూ ఇదే విధంగా మారుస్తారు. ఇక ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు బస్సుల విషయానికి వస్తే, ఈ బస్సుల్లో ఓ వైపు మూడు సీట్లు, మరోవైపు రెండు సీట్లు ఉంటాయి. అంటే, వరుసకు ఐదుగురు కూర్చోవచ్చు. ఐదుగురి స్థానంలో ఇద్దరే కూర్చునేలా నిబంధనలను మారుస్తున్నారు. ఈ బస్సుల్లో సీట్లను మార్చకుండా జిగ్ జాగ్ పద్ధతిలో ప్రయాణికులను అనుమతిస్తారు.

అంటే, తొలి వరుసలో మూడు సీట్లున్న లైన్ లో ఒకరు కిటికీ పక్కన కూర్చుంటే, రెండు సీట్లున్న చోట కూర్చునే వ్యక్తి, కిటికీ పక్కన ఉండరాదు. ఇక రెండో లైన్ లో కుడి వైపున్న వ్యక్తి కిటికీ పక్కన కూర్చుంటే, మూడు సీట్లుండే స్థానంలోని వ్యక్తి కిటికీ పక్కన ఉండకుండా నిబంధనలు మారుస్తున్నారు. ఇలా చేస్తే ప్రయాణికుల మధ్య భౌతిక దూరం కనీసం మీటరు వరకూ ఉంటుందని అధికారులు తేల్చారు.

ఇక సిటీ బస్సుల విషయానికి వస్తే, నిలబడి ప్రయాణించడాన్ని రద్దు చేస్తూ, సీటుకు ఒకరే ఉండేలా చూడాలని ప్రతిపాదించారు. దీని అమలు కాస్తంత కష్టమే అయినా, ఎలాగైనా అమలు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది.

వాస్తవానికి తెలంగాణలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి మినహా మిగతా ప్రాంతాలన్నీ దాదాపు గ్రీన్ జోన్ లోనే ఉండగా, కేంద్రం నుంచి అనుమతులు లభించి, కేసీఆర్ పచ్చజెండా ఊపగానే బస్సులను ప్రారంభిస్తామని, ఇదే సమయంలో గ్రీన్ జోన్లలో ఆటోలు, క్యాబ్ లకు కూడా పరిమితులతో కూడిన అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.
Tags: TS, RTC, Buses, Corona Virus, Social Distancing, New Seating

VH KCR, Pothireddypadu, GO203, Telangana, Andhra Pradesh

కేసీఆర్ పోతిరెడ్డిపాడును జగన్ కు అప్పగించేశారు: వీహెచ్ వ్యంగ్యం

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్రబిందువుగా నిలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు స్పందించారు. సీఎం కేసీఆర్ పోతిరెడ్డిపాడును ఏపీ సీఎం జగన్ కు అప్పగించేశారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలు అందని నేపథ్యంలో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏదేనీ అంశంపై గట్టిగా ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని వీహెచ్ ఆరోపించారు.

అటు కరోనా అంశంపైనా ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. కరోనా కట్టడిలో కేసీఆర్ ఒట్టిమాటలు చెబుతున్నారని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులు, దాతల విరాళాలకు లెక్కా పత్రం లేదంటూ ఆరోపణలు చేశారు. పేదలకు ఇచ్చిన 1500 రూపాయలను వైన్ షాపులు తెరవడం ద్వారా ప్రభుత్వమే లాక్కుందని మండిపడ్డారు.
Tags: VH KCR, Pothireddy Padu, GO203, Telangana, Andhra Pradesh

Corona Virus,India,Telangana, live report

దేశంలో 24 గంటల్లో కొత్తగా 540 మందికి కరోనా..

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. 24 గంటల్లో కొత్తగా 540 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5,734కి చేరిందని ఈ రోజు ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు 166 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం ఆసుపత్రుల్లో 5,095 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 473 మంది కోలుకున్నారు. 24 గంటల్లో దేశంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్‌లో కరోనాతో ఈ రోజు మొదటి మరణం సంభవించింది.

మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,135 మందికి కరోనా సోకింది. తమిళనాడులో 738, ఢిల్లీలో 669, తెలంగాణలో453, రాజస్థాన్‌లో 381, ఉత్తర్‌ప్రదేశ్‌లో 361, ఆంధ్రప్రదేశ్‌లో 348 మందికి కరోనా సోకింది.
Tags: Corona Virus,India,Telangana, live report

అందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే మా లక్ష్యం: కేటీఆర్

అందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే మా లక్ష్యం: కేటీఆర్

తెలంగాణలో అందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేదే తమ లక్ష్యమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలోనే గృహాలను మంజూరు చేస్తామని చెప్పారు. సిరిసిల్లలో ఈరోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇళ్ల మంజూరు కోసం ఎవరికీ డబ్బు ఇవ్వొద్దని సూచించారు. ఒక్క పైసా కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. అర్హులైన అందరి జాబితా ప్రభుత్వం వద్ద ఉందని… అందరికీ ఇళ్లను అందిస్తామని తెలిపారు. సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్న చీరల్లో సరికొత్త డిజైన్లు తీసుకొస్తామని చెప్పారు. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఈరోజు ఉదయం జరిగిన విషయం తెలిసిందే. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ పది మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం కేసీఆర్ ఆ పది మంత్రులకు ఈ సాయంకాలం శాఖలు కేటాయించారు.

వైద్య, ఆరోగ్య శాఖ- ఈటల రాజేందర్
పశు సంవర్థక శాఖ- తలసాని శ్రీనివాస్ యాదవ్
విద్యాశాఖ- జగదీశ్ రెడ్డి
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్- ఎర్రబెల్లి దయాకర్ రావు
న్యాయశాఖ, దేవాదాయ, అడవులు, పర్యావరణ శాఖ- అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
సంక్షేమ శాఖ- కొప్పుల ఈశ్వర్
రవాణా, రోడ్లు, భవనాల శాఖ- వేముల ప్రశాంత్ రెడ్డి
వ్యవసాయ శాఖ- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ఎక్సైజ్, పర్యాటకం, క్రీడలు- వి.శ్రీనివాస్ గౌడ్
కార్మిక, ఉపాధి, మానవ వనరుల అభివృద్ధి- చామకూర మల్లారెడ్డి