రాహుల్, అఖిలేష్ భారత ఇంజినీర్లను అవమానించారు.. మోదీ

రాహుల్, అఖిలేష్ భారత ఇంజినీర్లను అవమానించారు.. మోదీ

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మరుసటి రోజే ఆ రైలు సాంకేతిక సమస్యలకు లోనయింది. దీనిపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. అలాగే ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా విమర్శనాత్మక ట్వీట్ చేశారు. దీనిపై నేడు ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకు పడ్డారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై విమర్శలు గుప్పించడం ద్వారా రాహుల్, అఖిలేష్ భారత ఇంజినీర్లను అవమానించారని మోదీ ఆరోపించారు.

ప్రతికూల వ్యాఖ్యలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, నైతిక స్థైర్యం కోల్పోవద్దని ప్రజలకు సూచించారు. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలును లక్ష్యంగా విమర్శలు చేయడం దారుణమన్నారు. ఈ ప్రాజెక్టులో భారత ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు భాగమని ఈ రైలును విమర్శించడమంటే.. వారిని అవమానించడమేనన్నారు. ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల శ్రమను దేశం గౌరవిస్తోందని.. వారు దేశానికి గర్వకారణమన్నారు.

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.34,550, విశాఖపట్నంలో రూ.34,550, ప్రొద్దుటూరులో రూ.34,000, చెన్నైలో రూ.33,430గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,990, విశాఖపట్నంలో రూ.31,780, ప్రొద్దుటూరులో రూ.31,490, చెన్నైలో రూ.31,960గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,500, విశాఖపట్నంలో రూ.41,400, ప్రొద్దుటూరులో రూ.41,500, చెన్నైలో రూ.43,600 వద్ద ముగిసింది.

ఒక్క చెంపదెబ్బతో జైషే చీఫ్ మసూద్ అజహర్ అన్నీ కక్కేశాడట!

ఒక్క చెంపదెబ్బతో జైషే చీఫ్ మసూద్ అజహర్ అన్నీ కక్కేశాడట!

మౌలానా మసూద్ అజహర్… కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు. భారత్ అంటే వల్లమాలిన ద్వేషం ప్రదర్శించే మసూద్ అజహర్ భారత్ లో అనేక ఉగ్రదాడులకు కారకుడు. కశ్మీర్ కోసం భారత్ ను అస్థిరతకు గురిచేయడమే అతడి ఏకైక అజెండా. అందుకోసం ఎంత దారుణానికైనా తెగిస్తాడు. అయితే ఇవన్నీ పైకి కనిపించే విషయాలేనని, వాస్తవానికి మసూద్ అజహర్ చాలా పిరికివాడని భారత ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. 1994లో పోర్చుగీస్ పాస్ పోర్టుతో బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించినప్పుడు భారత్ భద్రత బలగాలు అతడిని అరెస్ట్ చేశాయి. ఈ సందర్భంగా కస్టడీలోకి తీసుకున్న అధికారులు అతడ్ని సుదీర్ఘంగా ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు.

అయితే, ఇంటరాగేషన్ మొదలైన కొన్ని నిమిషాలకే అతడ్ని ఓ ఆర్మీ అధికారి గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు కళ్లు బైర్లు కమ్మిన మసూద్ అజహర్ అడిగినవీ, అడగనివీ అన్నీ చెప్పేశాడట. పాకిస్థాన్ భూభాగంపై స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఉగ్రసంస్థలు ఎలా పనిచేస్తాయో అన్నీ కూలంకషంగా వివరించాడని సదరు ఆర్మీ అధికారి మీడియాకు వివరించాడు. అజహర్ తో నిజాలు కక్కించేందుకు ఎంతో కష్టపడాలేమో అని భావించామని, కానీ అతడెంతో సులభంగా చెప్పేశాడని ఆ అధికారి వెల్లడించారు.

ఇదే విషయం గురించి సిక్కిం రాష్ట్ర డీఐజీ అవినాశ్ మోహననే కూడా వ్యాఖ్యానించారు. ఆయన కూడా గతంలో పలుమార్లు మసూద్ అజహర్ ను ఇంటరాగేట్ చేశారు. “మసూద్ అజహర్ పైకి కనిపించేంత గట్టివాడు కాదు… అతడ్ని బెదిరించడం చాలా సులభం. ఒక్క చెంపదెబ్బకే బెంబేలెత్తిపోయాడు. ఆ అధికారి కొట్టిన దెబ్బకు నిలువెల్లా కంపించిపోయాడు. దాంతో అతడిపై మేం ప్రయోగించాలి అని భావించిన పద్ధతులన్నీ పక్కనబెట్టేశాం. ఇంటరాగేషన్ జరిగినంత సేపు మేం అడగాల్సినవన్నీ అతడే చెప్పేశాడు” అని వివరించారు.

భారత్ కు అప్పగింతపై యూకే హైకోర్టును ఆశ్రయించిన విజయ్ మాల్యా

భారత్ కు అప్పగింతపై యూకే హైకోర్టును ఆశ్రయించిన విజయ్ మాల్యా

వేల కోట్ల రూపాయల రుణాల ఎగవేత వ్యవహారంలో బ్రిటన్ పారిపోయి లండన్ లో తలదాచుకుంటున్న బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా స్వదేశంలో విచారణ ఎదుర్కోవడానికి ఏమాత్రం ఇష్టపడడంలేదు. నేరస్తుల పరస్పర అప్పగింత ఒప్పందంలో భాగంగా బ్రిటన్ ప్రభుత్వం తనను భారత్ కు అప్పగించాలని తీసుకున్న నిర్ణయాన్ని మాల్యా బ్రిటీష్ కోర్టులో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. తాజాగా తన న్యాయవాది ద్వారా యూకే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్ లో హోమ్ శాఖ సెక్రటరీ నిర్ణయాన్ని ప్రశ్నించిన మాల్యా… వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును కూడా సవాల్ చేశారు.

ఫిబ్రవరి మొదటి వారంలో ఈ కేసును విచారించిన వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానం భారత్ లోని కోర్టులకు మాల్యా జవాబు చెప్పాల్సి ఉందని తన తీర్పులో విస్పష్టంగా పేర్కొంది. అంతేకాదు, తన తీర్పు కాపీని యూకే హోమ్ సెక్రటరీ సాజిద్ జావిద్ కు పంపించింది. సాధారణంగా ఓ నేరస్తుడిని మరో దేశానికి అప్పగించే అధికారం బ్రిటన్ లో హోమ్ సెక్రటరీ ఒక్కడికి మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో సాజిద్ జావిద్ అన్ని విషయాలు పరిశీలించి మాల్యాను భారత్ కు అప్పగించాలంటూ పత్రాలపై సంతకాలు చేశారు. ప్రస్తుతం ఈ నిర్ణయంపైనే మాల్యా యూకే హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై మీడియా ప్రతినిధులు మాల్యాను వివరణ కోరగా, ఈ వ్యవహారంలో అప్పీల్ చేస్తానని ముందే చెప్పానని, ఈ కేసులో తీర్పు ఎప్పుడొస్తుందన్నది మాత్రం చెప్పలేనని, అన్ని వ్యవహారాలు తన లాయర్ చూసుకుంటున్నాడని తెలిపారు.

విజయ్ మాల్యా 2009లో భారత్ లోని అనేక బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ప్రస్తుతం రూ.10,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ను దారిలో పెట్టడానికి ఆయన తీసుకున్న రుణాలు తీర్చలేనివిగా మారాయి. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రారంభించిన ఆ ఎయిర్ లైన్స్ నానాటికీ గుదిబండలా మారడమే కాదు ఆయనకు ఎంతో పట్టున్న లిక్కర్ వ్యాపారాలను సైతం ప్రభావితం చేసింది. తనకు భారీగా వాటాలున్న అనేక మద్యం వ్యాపారాలను కూడా మాల్యా విక్రయించాల్సి రావడమే కాదు చివరికి బ్యాంకు అప్పులు కూడా తీర్చలేని పరిస్థితుల్లో విదేశాలకు పరారయ్యాడు.

ప్రతీకారం ఎలా? మంత్రులతో మోదీ అత్యవసర సమావేశం!

ప్రతీకారం ఎలా? మంత్రులతో మోదీ అత్యవసర సమావేశం!

నిన్న పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై దాడి జరిపిన ఉగ్రవాదులు 44 మందిని బలిగొన్న ఘటనపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, నేడు అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటలకు క్యాబినెట్ భేటీ జరుగనుండగా, పుల్వామా ఉగ్రదాడిపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థను ఇక ఏ మాత్రం ఉపేక్షించరాదని భావిస్తున్న కేంద్రం, ఈ మేరకు ఇతర దేశాల సాయంతో పాకిస్థాన్ పై ఒత్తిడిని పెంచే విషయంపైనా చర్చించనుంది. ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్న విషయంపైనా చర్చ జరుగుతుందని సమాచారం. కాగా, ఉగ్రవాదుల దాడిలో మరో 45 మందికి గాయాలు కాగా, వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాసుల వర్షం కురిపిస్తున్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ!

కాసుల వర్షం కురిపిస్తున్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ!

గతేడాది అక్టోబరు 31న ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) కాసుల వర్షం కురిపిస్తోంది. 33 నెలల్లో రూ.2,989 కోట్లతో నిర్మించిన ఈ విగ్రహాన్ని తీవ్ర భూకంపాలు వచ్చినా తట్టుకునేలా తీర్చిదిద్దారు. గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటు చేయగా ఇప్పుడీ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా మారింది. వందలాదిమంది ఈ విగ్రహం చూసేందుకు తరలివస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతోంది.

గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది జనవరి మధ్య విగ్రహాన్ని ఏకంగా 7,81,349 మంది సందర్శించారు. వీరి నుంచి ఏకంగా 19.47 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్టు పర్యాటక శాఖ అధికారి ఒకరు తెలిపారు. విగ్రహంతోపాటు పక్కనే ఉన్న సర్దార్ సరోవర్ డ్యాంను సందర్శించే వారి సంఖ్య కూడా పెరిగిందని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కేజే ఆల్పాన్స్ తెలిపారు. మూడు నెలల్లో 8,22,009 మంది డ్యాంను సందర్శించినట్టు వివరించారు.

నాడు వారు చెప్పినట్టే ప్యాకేజీకి మార్పులు చేశాం..కేంద్రమంత్రి పీయూష్ గోయల్

నాడు వారు చెప్పినట్టే ప్యాకేజీకి మార్పులు చేశాం..కేంద్రమంత్రి పీయూష్ గోయల్

ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా 2016 అక్టోబర్‌లో కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతించారని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. నేడు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. నాడు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మార్పులన్నీ ప్యాకేజీలో చేశామని.. దానికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందన్నారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు 2017 మే 2న ధన్యవాదాలు తెలుపుతూ.. కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశారని పీయూష్ గోయల్ తెలిపారు

‘రాఫెల్’ ఒప్పందంలో ‘ఉల్లంఘన’.. ద హిందూ పత్రిక కథనంతో ప్రకంపనలు

‘రాఫెల్’ ఒప్పందంలో ‘ఉల్లంఘన’.. ద హిందూ పత్రిక కథనంతో ప్రకంపనలు

రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో కీలక షరతులను ప్రభుత్వం ఉల్లంఘించిందంటూ జాతీయ పత్రిక ‘ద హిందూ’ ప్రచురించిన కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది. రక్షణ ఒప్పందాల్లో అవినీతిపై పోరాటం చేస్తున్నట్టు పదేపదే చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం.. అవినీతి చర్యలకు జరిమానా, చెల్లింపుల కోసం ఎస్క్రో ఖాతా నిర్వహణ వంటి కీలక షరతులను ఒప్పందం నుంచి తొలగించిందంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. భారత్-ఫ్రాన్స్ మధ్య 2016లో ఒప్పందం ఖరారు కావడానికి ముందే ఈ ‘ఉల్లంఘన’ జరిగిందని పేర్కొంది.

భారత్-ఫ్రాన్స్ మధ్య రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఒప్పందం కుదరగా దసో ఏవియేషన్ సరఫరాదారుగా ఉండనుంది. అయితే, ప్యాకేజీ బాధ్యతలను మాత్రం ఎంబీడీఏ ఫ్రాన్స్ నిర్వహిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ రెండూ ప్రైవేటు సంస్థలే. అయితే, దసో-ఎంబీడీఏలతో కుదిరిన సరఫరా ప్రోటోకాల్స్ నుంచి కీలకమైన నిబంధనను ఎగరగొట్టేశారని పత్రిక తన కథనంలో పేర్కొంది.

అత్యున్నత రాజకీయ జోక్యం వల్లే ఇది సాధ్యమైందని, చివరి నిమిషంలోనే ఈ మార్పు జరిగిందని వివరించింది. ఎస్క్రో ఖాతా లేకపోవడం వల్ల భారత వైమానిక దళానికి ఒరిగేదేమిటని ప్రశ్నించింది. కీలకమైన నిబంధనను ఉల్లంఘించి ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ఫ్రాన్స్‌తో చర్చలు జరిపిన భారత చర్చల బృందంలోని ముగ్గురు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదని పేర్కొంది.

శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద మళ్లీ ఉద్రిక్తత

శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద మళ్లీ ఉద్రిక్తత

కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయం వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మలయాళ నెల కుంభం సందర్భంగా ఈరోజు నుంచి ఐదు రోజులపాటు ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. సాయంత్రం నుంచి ముఖ్య పూజారి వాసుదేవన్‌ నంబూద్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ప్రారంభంకానున్న నేపధ్యంలో ఏం జరుగుతుందా? అన్న ఉత్కంఠ నెలకొంది.

ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం, హిందూ సంస్థల మధ్య పోరాటం నెలకొన్న విషయం తెలిసిందే. కోర్టు తీర్పును అమలు చేయాలని సర్కారు యత్నిస్తుండగా, అంగీకరించేది లేదని హిందూ సంస్థలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కొందరు మహిళలు ఆలయంలోకి గుట్టుచప్పుడు కాకుండా ప్రవేశించిన విషయం వెలుగు చూడడంతో ఈసారి హిందూ సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి. దీంతో పోలీసులు ఆలయం పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు. నలుగురికి మించి గుమిగూడరాదని ఆదేశాలు జారీ చేశారు.

దేశంలోనే వేగవంతమైన రైలు చార్జీలు ఇవీ..

దేశంలోనే వేగవంతమైన రైలు చార్జీలు ఇవీ..

దేశంలోనే వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ 18) ప్రయాణ చార్జీల వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. ఢిల్లీ, వారణాసి మధ్య నడిచే ఈ రైలు ఫిబ్రవరి 15 నుంచి పట్టాలెక్కనుంది. ఇందులోని ఏసీ చెయిర్ కార్ టికెట్‌ను రూ.1850గా నిర్ణయించగా.. ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.3520గా ఉంది. ప్రస్తుతం నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ చెయిర్ కార్ ధరల కంటే ఈ ధరలు ఒకటిన్నర రెట్లు ఎక్కువ కాగా.. ఎగ్జిక్యూటివ్ టికెట్ ధర 1.4 రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఇక వారణాసి నుంచి ఢిల్లీకి వచ్చే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చెయిర్ కార్ టికెట్ రూ.1795, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ రూ.3470గా నిర్ణయించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ సెమీ హైస్పీడు రైలును ఢిల్లీలో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇక ఆహారం ధరలు కూడా రెండు తరగతులకు వేర్వేరుగా ఉన్నాయి. ఢిల్లీ నుంచి వారణాసికి ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో వెళ్లే వాళ్లకు రూ.399 చార్జ్ చేయనున్నారు. ఇందులో ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఉంటాయి. చెయిర్‌కార్‌లో వెళ్లే వాళ్లకు ఇది రూ.344గా ఉంటుంది. అదే వారణాసి నుంచి ఢిల్లీ వెళ్లే వాళ్లకు ఈ ధరలు రూ.349, రూ.288గా ఉంటాయి.