న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఇవాళ సాయంత్రం కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొందరికి పదోన్నతులు కల్పించడంతో పాటు మరికొందరికి ఉద్వాసన పలుకుతున్నారు.
కేంద్ర మంత్రులు సదానంద గౌడ, సంతోష్ గంగ్వార్, రమేష్ పోఖ్రియాల్, ధన్వి పాటిల్, సంజయ్ ధోంత్రే, దేవశ్రీ లు ఇవాళ తమ పదవులకు రాజీనామా సమర్పించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా లభించే అవకాశాలు ఉండడంతో ఆయన శాఖ మార్చవచ్చని అంటున్నారు. రెండోసారి అధికారం చేపట్టిన తరువాత నరేంద్ర మోదీ తొలిసారి కేబినెట్ ను విస్తరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంత్రివర్గ కూర్పును ఖరారు చేశారు. నూతనంగా చేర్చుకోనున్న నాయకులను ప్రధాని తన నివాసానికి పిలిపించుకున్నారు. వారికి దిశా నిర్థేశం చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.