రాజ్యసభలో రెండో రోజు ప్రత్యేక హోదాపై నోటీసు

ప్లకార్డ్‌తో పోడియం వద్ద విజయసాయి రెడ్డి ఆందోళన న్యూఢిల్లీ, జూలై 20: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ అంశంపై చర్చ జరపాలని కోరుతూ రాజ్యసభలో మంగళవారం రెండో రోజు వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీ వి.విజయసాయి రెడ్డి రూల్‌ 267 కింద ఇచ్చిన నోటీసును చైర్మన్‌ తిరస్కరించారు. దీంతో ప్లకార్డ్‌ పట్టుకుని విజయసాయి రెడ్డి పోడియం వద్ద ఆందోళనకు పూనుకున్నారు.

ఇంతలో సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే విజయసాయి రెడ్డితోపాటు ప్రతిపక్ష సభ్యులు తాము రూల్‌ 267 కింద తాము ఇచ్చిన నోటీసును అనుమతించాలని కోరారు. దీనిపై చైర్మన్‌ స్పందిస్తూ రూల్‌ 267 కింద ఈరోజు 15 మంది సభ్యులు నోటీసులు ఇచ్చారని అందులో జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలు అనేకం ఉన్నప్పటికీ వాటిని ఇప్పటికిప్పుడు తాను చర్చకు అనుమంతించలేనని అన్నారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ కూడా జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశమే. దీనిపై చర్చకు మీరు ఎప్పుడు అనుమతిస్తారని ప్రశ్నించారు. చైర్మన్‌ దీనికి సమాధానం చెబుతూ దీనిపై వాదన వద్దని, ఈ అంశం (ప్రత్యేక హోదా) మీకు (రాష్ట్ర ప్రభుత్వం) కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదని జవాబిచ్చారు. చైర్మన్‌ జవాబుకు సంతృప్తి చెందని విజయసాయి రెడ్డి ప్లకార్డు పట్టుకుని పోడియం వద్ద ప్రదర్శిస్తూ నిలబడ్డారు. సభలో గందరగోళం ఏర్పడటంతో చైర్మన్‌ సభను గంటపాటు వాయిదా వేశారు.

Leave A Reply

Your email address will not be published.